పల్లె, పట్టణ ప్రగతిపై కేసీఆర్ గరంగరం.. 10 రోజుల్లో మారకుంటే మీ పని అంతే!

by  |
CM KCR
X

దిశ, వెబ్‌డెస్క్ : వివిధ శాఖల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధకారులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు. పది రోజులు సమయం ఇస్తున్నానని, పద్ధతి మార్చుకోకపోతే చర్యలు కఠినంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పనులపై రివ్యూ నిర్వహించిన కేసీఆర్.. ఈనెల 20న సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జూన్ 21న వరంగల్‌లో పర్యటించి నూతన కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవం, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి శంఖుస్థాపనలో పాల్గొననున్నట్లు అధికారులకు సూచించారు.

ఆస్పత్రిని అత్యాధునిక హంగులతో 24 అంతస్తులతో గ్రీన్ బిల్డింగ్ గా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు, డీపీవోలు కష్టపడుతున్నా.. ఆశించినంత మేర పనులు జరగడం లేదని విచారం వ్యక్తంచేశారు. అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నానని, పదే పదే పనితీరు మార్చుకోవాలని చెప్తున్నా ఎవరూ వినడం లేదని మండిపడ్డారు. పది రోజుల సమయం ఇస్తున్నా.. ఆ తర్వాత ఆకస్మిక తనిఖీలు చేసి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

వైద్యరోగ్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, ఆస్పత్రి భవనం పైనే హెలికాప్టర్ దిగేలా హెలిప్యాడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పల్లె ప్రకృతి వనాల కోసం ప్రభుత్వ భూమి లేకుంటే.. ప్రైవేట్ భూములు కొనాలని అధికారులకు సూచించారు. పల్లెలు, పట్టణాలు వందశాతం అభివృద్ధి జరగాలని సీఎం ఆకాంక్షించారు. అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం అవసరమని, తాను కూడా ఒక జిల్లాను దత్తత తీసుకుంటానని సీఎం ప్రకటించారు. వర్షాలు పడుతున్నందున హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఉపసర్పంచులు, కార్యదర్శులు తమ పనితీరు మార్చుకోకపోతే వారిని తొలగించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు.

Next Story