స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

by  |
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష
X

దిశ, న్యూస్ బ్యూరో

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రజలంతా స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ పాటించాలని, అదే అన్నింటికంటే ఉత్తమమైన మార్గమని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యనించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా ఉండాలని కోరారు. ఈ వైరస్ ఇతర దేశాల నుంచి వస్తున్నందున మార్చి నెల 1వ తేదీ తర్వాత విదేశాల నుంచి వచ్చినవారి వివరాలన్నింటినీ సేకరిస్తున్నామని, అలాంటివారు స్వచ్ఛందంగా కలెక్టర్ లేదా జిల్లా ఎస్పీకి రిపోర్టు చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ మొదలు మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి వరకు ప్రభుత్వ సిబ్బంది ఈ వివరాలను సేకరిస్తారని తెలిపారు. షాపింగ్ మాల్స్, కిరాణా దుకాణాలు యధావిధిగా తెరిచే ఉంటాయని, కృత్రిమ కొరతను సృష్టించకుండా బ్లాక్ మార్కెటీర్లపై ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. పదవ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రతీ పరీక్షా కేంద్రంలో శానిటైజర్లతో పాటు శుభ్రతా కార్యక్రమాలు ముమ్మరంగా ఉంటాయని, పిల్లలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి చాలా మంది తెలంగాణకు వస్తున్నందున జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై 18 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని, వాహనాల తనిఖీ ఉంటుందని, అందులోని ప్రయాణీకులు విదేశాల నుంచి వచ్చినట్లు తేలితే క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు.

తెలంగాణలో పాజిటివ్‌గా తేలిన 14 మంది పేషెంట్లలో ఐదుగురు మాత్రమే విమానాశ్రయం ద్వారా వచ్చారని, మిగిలినవారు ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలోకి చేరుకున్నారని గుర్తుచేశారు. అందువల్ల అలా వచ్చినవారి వివరాలన్నీ సేకరించడం ద్వారా తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఇండోనేషియా బృందంలోని పలువురికి పాజిటివ్ లక్షణాలు ఉన్నందున జిల్లాలో వారు ఎక్కడెక్కడ తిరిగారో వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్ళకుండా ఉంటే మంచిదని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను ప్రభుత్వం జరపడంలేదని, ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం మాత్రం లైవ్ లో ప్రసారమవుతుందని, ప్రజలు ఇళ్ళలో ఉండి వీక్షించాలని కోరారు. ముస్లిం సోదరులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి శుక్రవారం ప్రార్థనలతో పాటు మతపరమైన కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారని గుర్తుచేశారు. షాదీఖానాలను కూడా మూసివేయాల్సిందిగా వారే కోరారని, ముందుగానే పెళ్ళిళ్ళు ఫిక్స్ అయినచోట రాత్రి తొమ్మిదిగంటలకల్లా ముగించాల్సిందిగా సూచించినట్లు తెలిపారు.

విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ విధిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని, ఇండ్లలోనే స్వీయ నియంత్రణలో ఉంటామనేవారికి అలాంటి అవకాశం కల్పిస్తామని, అయితే వారిపై రాష్ట్ర వైద్యారోగ్య, పోలీసు శాఖ పర్యవేక్షణ ఉంటుందన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ వ్యాధి విదేశాల నుంచి వచ్చినవారికి మాత్రమే వచ్చిందని, వారి ద్వారా స్థానికులకు ఎవ్వరికీ సోకలేదని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించినందున పేషెంట్లకు కనీసం వెంటిలేటర్‌ను అమర్చాల్సిన అవసరం రాలేదన్నారు. విదేశాల నుంచి వైరస్ లక్షణాలు వస్తున్నందున భారత ప్రభుత్వం ముందుగానే ఆలోచించి విదేశీ విమానాలను రద్దు చేసినట్లయితే ఈ ప రిస్థితి వచ్చేది కాదన్నారు. శుక్రవారం ప్రధానితో వీడియో కాన్ఫరెన్సు సమావేశం ఉన్నందున తక్షణం విదేశీ విమానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తానన్నారు. ఈ నెల 22 తర్వాత నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా వెంటనే అమలులోకి తేవడం అవసరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

పటిష్టమైన చర్యలు తీసుకున్నచోట వైరస్ వ్యాప్తి జరగలేదని, అందుకు చైనా దేశానికి ఆనుకుని ఉన్న తైవానే నిదర్శమని కేసీఆర్ గుర్తుచేశారు. అలాంటి జాగ్రత్తలు పాటించని ఇరాన్, ఇటలీ లాంటి దేశాల్లో వ్యాధి తీవ్రత ఎలా ఉందో చూస్తున్నామన్నారు. మతపరమైన కార్యక్రమాల కారణంగా ఆ రెండు దేశాల్లో వైరస్ వేగంగా వ్యాపించిందని, దాన్ని దృష్టిలో పెట్టుకునే ముస్లిం సోదరుల సహకారంతో వారి మతపరమైన కార్యకలాపాల నియంత్రణ జరుగుతోందని, ప్రభుత్వం కూడా ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను నియంత్రిస్తోందన్నారు. ఇందుకోసం బిషప్‌లు, ఫాస్టర్‌లు, పూజారులకు, గురుద్వారా నిర్వాహకులకు అప్పీల్ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది జనం గుమికూడకుండా చూసుకోవడమే అన్నింటికన్నా ఉత్తమమైన మార్గమన్నారు.

రవాణా వ్యవస్థలోనూ ఎప్పటికప్పుడు శానిటైజేషన్ జరగాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ప్రస్తుతం 1165 మంది ఉన్నారని, వారికి అవసరమైన చికిత్సపై వైద్యారోగ్య శాఖ దృష్టి పెట్టిందన్నారు. తెలంగాణలోని 14 మంది పాజిటివ్ పేషెంట్లలో ఒక్కరు కూడా తెలంగాణలో ఉన్నవారుకాదని, విదేశీ ప్రయాణం ముగించుకుని వచ్చినవారేనని గుర్తుచేశారు. రైతులు పంటలు పండించుకుని మార్కెట్లకు వస్తారని, కానీ వారి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం లేదని, కారణం వారు విదేశీ ప్రయాణాలు చేసినవారు కాదని, అందువల్లనే ఎలాంటి ఆంక్షలు విధించడంలేదన్నారు. నిజంగా అలాంటి ఆందోళనకర పరిస్థితే వస్తే అప్పుడు ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు రోడ్లమీదకు రావద్దని, ఇండ్లలోనే ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Tags: Telangana, Corona, KCR, Press Meet, Foreigners, Airport, Quarantine

Next Story

Most Viewed