ఈటల భూ కబ్జాల కథ కంచికేనా.. కేసులపై కేసీఆర్ మౌనం అందుకేనా.?

by  |
ఈటల భూ కబ్జాల కథ కంచికేనా.. కేసులపై కేసీఆర్ మౌనం అందుకేనా.?
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : దేవాలయ, అసైన్డ్ భూములను ఆక్రమించుకొన్నారని ఈటల రాజేందర్‌ను ఆగమేఘాల మీద మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పలు కేసులు నమోదు చేసి నేడో, రేపో ఈటల అరెస్ట్ అంటూ.. హడావిడి చేశారు. రాజేందర్ బీజేపీలో చేరడంతో కేసుల ఊసే కరువైంది. నివేదిక సంగతి అధికార యంత్రాంగం మరిచిపోవడంపై పలు విమర్శలున్నాయి.

దేవరయంజాల్‌లో 1,521 ఆలయ భూములు..

మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం దేవరయంజాల్ గ్రామంలో పురాతనమైన శ్రీ సీతారామ స్వామి దేవాలయం ఉంది. ఆలయానికి సంబంధించి రావు బహుద్దూర్‌గా పేరు పొందిన రామిని పుల్లయ్యకు అప్పట్లో నిజాం 1,521 ఎకరాల భూమిని ఇనాంగా ఇచ్చారు. పుల్లయ్య ఈ భూములను దేవాలయానికి రాసిచ్చినట్లు రికార్డులున్నాయి. 1976 నుంచి ఆ భూముల్లో కబ్జాలు కొనసాగుతున్నాయి. వాటిపై ఓ వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో దేవాదాయ శాఖ మేల్కొంది.

పలుమార్లు ఆలయ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది. భూ కబ్జాదారులు రాజకీయ ఒత్తిళ్లతో ముందుకు సాగలేకపోయింది. అయితే 1995 లో భూముల వివాదం తారస్థాయికి చేరింది. దివంగత సీఎం వైఎస్ఆర్ హాయంలో దివాన్ కమిటీని వేసి భూముల వ్యవహారాన్ని తేల్చాలని ప్రభుత్వం కోరింది. భూములు దేవాలయానికి చెందినవి అనే ఆధారాలు లేవని కమిటీ పేర్కొన్నది. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గత మే నెలలో ఈటల ఎపిసోడ్‌తో దేవాలయ భూములు సంగతి మరోసారి తెరపైకి వచ్చింది.

నలుగురు ఐఏఎస్‌లతో కమిటీ..

మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని దేవరయంజాల్ భూ ఆక్రమణలపై ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్, ఇతరులు భూములు ఆక్రమించారన్న ఫిర్యాదులపై కమిటీ ఏర్పడింది. సీతారామ స్వామి భూములు కబ్జా చేశారని, పరిష్కారం కోసం పంచాయితీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. నల్లగొండ, మంచిర్యాల, మేడ్చల్(మాజీ ఇన్‌చార్జ్) కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ భారత్ హోలీకేరి, శ్వేతామహంతీలు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ఎంత భూమి ఆక్రమించారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని, 9 అంశాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. దీంతో నలుగురు ఐఏఎస్ అధికారులు దేవరయంజాల్ భూములను జల్లెడ పట్టారు. నాలుగు బృందాలుగా విడిపోయి భూముల వ్యవహారంపై పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. సీతారామ ఆలయంలోని పాత రికార్డులన్నింటీని పరిశీలించారు. దాదాపు నెల రోజుల పాటు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందజేస్తామని కమిటీ చైర్మన్ రఘునందన్ రావు అప్పట్లో వెల్లడించారు. 4 నెలలైనా కమిటీ నివేదికను వెల్లడించలేదు. నివేదికతోపాటు ఈటలపై నమోదైన కేసుల విషయంలోనూ ప్రభుత్వం మాజీ మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఈటల బీజేపీలోకి వెళ్లడంతో కేసులను నీరు గార్చారా? నివేదికను తొక్కిపెట్టారా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో చేరితే కేసులు ఉండవా? తప్పు చేసినా శిక్షలు పడవా? అనే చర్చ జరుగుతున్నది.ఈ విషయంపై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. ఆలయ, అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నాడని ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం, ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదో చెప్పాలని డిమాండ్​ చేశారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? లేదా? అన్నది సస్పెన్స్‌గానే మిగిలిపోయింది.


Next Story