సీఎం కేసీఆర్‌కు షాకిచ్చిన ‘మెఘా’ నిర్మాణ సంస్థ!

by  |
Megha Krishna Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై డిస్కవరీ డాక్యుమెంటరీ వివాదంగా మారుతోంది. ప్రముఖ ఇంగ్లిష్​ఛానల్​డిస్కవరీలో టెలికాస్ట్​ చేసిన కాళేశ్వరం ప్రత్యేక డాక్యమెంటరీలో కేవలం నిర్మాణ సంస్థనే హైలెట్​చేసినట్లు ఇరిగేషన్​ఇంజినీర్లు మండిపడుతున్నారు. అసలు ఇంజినీర్లు, ప్రభుత్వం చేసిందంతా పక్కన పెట్టి కేవలం మెఘా నిర్మాణ సంస్థ కష్టంతోనే కాళేశ్వరం పూర్తి చేశారనే విధంగా కథనం వచ్చిందంటూ ఇరిగేషన్​వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డిస్కవరీలో కాళేశ్వరం డాక్యుమెంటరీని ముందుగా హైలెట్​ చేసిన ప్రభుత్వం… నీటిపారుదల శాఖ ఆ తర్వాత తేలిగ్గా తీసిపారేస్తోంది. దాదాపు 55 నిమిషాల ఈ డాక్యుమెంటరీలో అత్యధికంగా మెఘా ప్రాజెక్టు, సంస్థ ఇంజినీర్లు, సంస్థ ప్రతినిధులనే హైలెట్​చేశారు. ప్రభుత్వం, ఇరిగేషన్​ఇంజినీర్ల భాగస్వామ్యాన్ని తెరకెక్కించడంలో వెనకబడ్డారు. దీంతో ఇది కాళేశ్వరం డాక్యుమెంటరా… మెఘా సంస్థ సొంత వీడియోలా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అంతా మెఘా మయం..!

వాస్తవానికి డిస్కవరీలో కాళేశ్వరం ప్రత్యేక డాక్యుమెంటరీపై ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం చేసింది. ఆ డాక్యుమెంటరీని తిలకించాలంటూ ప్రకటనలు గుప్పించింది. కాళేశ్వరం ప్రగతి దేశ, విదేశాలకు పాకుతుందని, అంతర్జాతీయ వేదికపై కాళేశ్వరం ఆవిష్కృతమవుతుందంటూ నీటిపారుదల శాఖ ఈ కథనానికి ప్రచారం కల్పించింది. కానీ డిస్కవరీలో వచ్చిన పూర్తి కథనంలో నిర్మాణ సంస్థను హైలెట్​ చేసినంతగా ప్రాజెక్టును చూపించలేదు. దీనిలో ప్రభుత్వం, ఇంజినీర్లు చేసిన కృషిని తక్కువగానే చూపించారు.

కేవలం నిర్మాణ సంస్థ కోసమే ఇదంతా చేశారనే కోణంలో తమ సంస్థను హైలెట్​ చేసుకునే విధంగా కథనాన్ని చూపించడంలో మెఘా సంస్థ కీ రోల్​ పోషించిందని, ఇంజినీర్ల కృషిని పక్కనపెట్టి తమ సంస్థనే హైలెట్​ చేసుకుందనే విమర్శలు మొదలయ్యాయి. అంతేకాకుండా పనులపై నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో కాకుండా… ఎంత మేరకు పనులు చేశాం, ఎలా పనులు చేశామంటూ మెఘా ఇంజినీర్లతోనే చెప్పించారు. డాక్యుమెంటరీలో మెఘా ఇంజినీరింగ్​సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్​ శ్రీనివాస్​రెడ్డితో పాటు ఇతర స్థాయిల్లోని కంపెనీ ఇంజినీర్లతోనే కథనంలో మాట్లాడించారు. అంతేకానీ మొదట్లో ఒకసారి, చివర్లో ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు సీఈతో మాట్లాడించారు.

అంతేకాకుండా కాళేశ్వరం నిర్మాణంలో తమ సంస్థను హైలెట్​ చేసుకునే క్రమంలో అటు ప్రభుత్వాన్ని కూడా పట్టించుకోలేదు. నిర్మాణ సంస్థ ఎండీ ఐదారు సార్లు మ్యాపులను పరిశీలిస్తూ, పలుమార్లు పనులను పరిశీలిస్తూ, కొన్ని సందర్భాల్లో తమ సిబ్బందికి సలహాలు ఇస్తూ కనిపించేలా చిత్రీకరించుకున్నారు. దీనిపై సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్​శ్రీనివాస్​రెడ్డితో పదేపదే మాట్లాడించారు. కానీ సీఎం కేసీఆర్, ఇంజినీర్లను కేవలం రెండు పర్యాయాలకే పరిమితం చేశారు.

సీఎం కేసీఆర్ అసహనం..

డిస్కవరీ ఛానల్​ డాక్యమెంటరీని వీక్షించాలని ప్రభుత్వం ఎంత ప్రచారం చేసిందో… టెలికాస్ట్​ తర్వాత అంత సైలెంట్​అయింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని, పనుల దగ్గర ఉన్న జల వనరుల శాఖ ఇంజినీర్లను కనీసం చూపించలేదు. కేవలం నిర్మాణ సంస్థే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లుగా, ఇది పూర్తి చేయడం కేవలం మెఘా సంస్థ గొప్పతనమే అన్నట్లుగా చూపించుకున్నారు. అంతేకాకుండా మేఘా కంపెనీ ఈ పనులు ప్రారంభించినప్పటి నుంచి దీని మ్యాపులు, డిజైన్లను చేయడంలో మెఘా ప్రతినిధులే చేసినట్లుగా కల్పించారు. పనులు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మెఘా కంపెనీ చేసిన పూజలు, పనులు… ఇలా అన్నింటినీ పాత వీడియోలతో ఈ కథనం చూపించారు. దీంతో సీఎం కేసీఆర్​ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ప్రభుత్వ గొప్పతనాన్ని కాదని కేవలం నిర్మాణ సంస్థను ఫోకస్​ చేయడంపై ఇరిగేషన్​ ఉన్నతాధికారులపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జల వనరుల శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లక్ష కోట్లు ఖర్చు పెట్టి చేపట్టిన ప్రాజెక్టును ఒక నిర్మాణ సంస్థ తమ గొప్పతనంగా చూపించుకోవడం డాక్యుమెంటరీలో ప్రధానంగా నిలిచిందని టీఆర్ఎస్​వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అటు ఇరిగేషన్ ఇంజినీర్లు కూడా సదరు నిర్మాణ సంస్థపై బహిరంగంగానే మండిపడుతున్నారు. మెఘా కంపెనీ ఇంజినీర్లు, ఆ సంస్థే పని చేసినట్లుగా చూపించుకుని, తమను తక్కువ చేశారంటూ ఆగ్రహిస్తున్నారు. మొత్తానికి కాళేశ్వరం డాక్యమెంటరీ ఇరిగేషన్​లో వివాదంగా మారింది.

Next Story

Most Viewed