తెలంగాణ అవతరించింది ఆయన బాటలోనే: కేసీఆర్

by  |
తెలంగాణ అవతరించింది ఆయన బాటలోనే: కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశానికి స్వాతంత్ర్యం తేవడానికి మహాత్మాగాంధీ శాంతియుత పంథానే ఎంచుకున్నారని, ఆయన బాటలోనే తెలంగాణ కూడా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం మన దేశ పరిస్థితిని ‘గాంధీకి ముందు’, ‘గాంధీకి తర్వాత’ అనే కోణాల్లో విశ్లేషణ చేయాల్సి ఉంటుందన్నారు. గాంధీ ఎంచుకున్న శాంతియుత పోరాట పంథా అప్పట్లో కొద్దిమంది విద్వేషవాదులకు నచ్చలేదని, తెల్లదొరలు కూడా హేళన చేశారని, కానీ చివరకు అదే బలమైన పోరాట ఆయుధంగా మారిందని, అందువల్లనే బ్రిటీషు పాలకులు తోకముడిచారని అన్నారు. ఆయన శాంతియుత పోరాటమే లేకుంటే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదే కాదన్నారు.

దేశవ్యాప్తంగా మొదలైన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ, సరిగ్గా 91 ఏళ్ళ క్రితం, 1930 మార్చి 12వ తేదీన గాంధీ దండిలో ఉప్పు సత్యాగ్రహాన్ని శాంతియుతంగానే ప్రారంభించారని, చేతిలో ఉప్పును పట్టుకుని పిడికిలి బిగించి మొదలు పెట్టారని, ఆ పిడికిలి శక్తే ఇప్పుడు మన దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిందన్నారు. శాంతియుతంగా పోరాటాలు ఎలా చేయాలో మొత్తం ప్రపంచానికే గాంధీ చాటిచెప్పారని, ఆ ఖ్యాతి ఆయనకే దక్కుతుందన్నారు. ఆ శాంతియుత పోరాటం, ఆయనకు ప్రజలు చూపిన సంఘీభావమే చివరకు బ్రిటీషు దొరలను వణికించిందని, తట్టుకోలేక ఆయనను జైల్లో పెట్టారని పేర్కొన్నారు.

అందుకే, గాంధీ చూపిన బాటలోనే మనం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకున్నామన్నారు. అప్పట్లో బ్రిటిష్ సైన్యం స్వాతంత్ర్య పోరాటయోధులను కొడుతూ ఉంటే కనీసం చేతులు కూడా అడ్డం పెట్టుకోకుండా లక్ష్య సాధన కోసమే పనిచేశారని, అందువల్లనే గాంధీకి ఉప్పుసత్యాగ్రహ పోరాటం ‘మ్యాన్ ఆఫ్ థి ఇయర్ ఆఫ్ థి వరల్డ్’ గుర్తింపు తెచ్చి పెట్టిందన్నారు. ఇప్పుడు ఆ ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా 75 వారాల పాటు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తోందన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు జరిగే ఈ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించాలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైందని గుర్తుచేశారు.

రాజకీయాలకు అతీతంగా గ్రామస్థాయిలో సామాన్యుల మొదలు ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రజా ప్రతినిధులతో సహా ప్రతీ ఒక్కరూ కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. జాతి స్వేచ్ఛను మరవకుండా స్వాతంత్య్రాని మరువకూడదన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్ ఆ తర్వాత గాల్లోకి బెలూన్లు వదిలారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed