నిజామాబాద్‌లో వారి ఓట్లే అధికం.. తుది జాబితా ఇదే!

by Disha Web Desk 9 |
నిజామాబాద్‌లో వారి ఓట్లే అధికం.. తుది జాబితా ఇదే!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన పూర్తయ్యే సమయానికి ఓటర్ల తుది జాబితా ఖరారైంది. ఎన్నికల నామినేషన్లలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు బరిలో ఉండటం ఖాయమైన నేపథ్యంలో ఓటర్ల జాబితాను ఖరారు చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నూతన జాబితాను సిద్దం చేశారు. గడిచిన ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో నిజామాబాద్ నియోజకవర్గంలో ఐదు నియోజకవర్గాలు, జగిత్యాల జిల్లాలో రెండు నియోజకవర్గం ఓటర్లు కలిపి జాబితా తయారైంది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈ నేపథ్యంలో రెండు జిల్లాల పరిధిలోని అసెంబ్లీ ఓటర్ లిస్ట్ తో కలిపి ఫిబ్రవరి 8 వరకు ఉన్న జాబితాకు కొత్త వారికి అవకాశం కల్పించి తుది జాబితాను తయారు చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన దరఖాస్తులు మార్పులు చేర్పుల ద్వారా ఓటర్ల సంఖ్య 17,04,౮౬౭ గా కొత్త జాబితా సిద్దమైంది.

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటర్ల తుది జాబితా ఖరారు అయింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అపెంబ్లీ నియోజకవర్గాల్లో 17 లక్షల ఓటర్లు ఉన్నట్లు నిజామాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. 18వ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ పార్లమెట్ స్థానాన్ని మే 13న ఎన్నికలు జరుగనున్నాయి. అయితే శుక్రవారం తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. 17,04,867 ఓటర్లకు గాను అందులో మహిళ ఓటర్లు 8,98,647 కాగా పురుషులు 8,06,130గా ఉన్నారు. ఇతరులు 90 మంది ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్ 2,23,096, నిజామాబాద్ అర్బన్ 3,04,317, నిజామాబాద్ రూరల్ 2,56,593, ఆర్మూర్ 2,12,145, బాల్కొండ 2,26,792 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, జగిత్యాల జిల్లాలోని కోరుట్ల 2,45,249, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 2,36,675 ఓటర్లతో మొత్తం 1704867 మంది ఓటర్లు ఉండగా, 944 ప్రాంతాలలో 1808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో నిజామాబాద్ జిల్లాలో 1288 పోలింగ్ స్టేషన్లు, జగిత్యాల జిల్లాలో 516 పోలింగ్ కేంద్రాలున్నాయి. 85 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్ ఓటర్లు 9878 మంది, దివ్యంగ ఓటర్లు 41190 మంది ఉండగా, ముందస్తుగానే వారికి 12-డీ ఫారాలు అందించారు. వీరిలో 85 ఏళ్ళు పైబడిన వారు 899 మంది దరఖాస్తులు చేసుకోగా వాటిలో 859 మంది దరఖాస్తులను అర్హులుగా గుర్తించారు. దివ్యంగ ఓటర్లలో 1027 దరఖాస్తులు రాగా, వాటిలో 899 మంది అర్హత కలిగి ఉన్నట్లు నిర్ధారించారు.

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున మాజీ ఆర్టీసీ చైర్మన్, సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లు బరిలో ఉన్నారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యే సరికి 32 మంది బరిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎవరు పోటీలో ఉంటారనేది స్పష్టం కానుంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో రైతులు కీలకపాత్ర పోశించారు. అందులో మహిళ రైతులు గణనీయమైన పాత్ర ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బీడీ కార్మికులు, వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు గల్ప్ కుటుంబాలకు చెందిన వారిని పరిగణలోకి తీసుకుంటే ఈ ఎన్నికల్లో మహిళలే కీలకమని చెప్పాలి. గత పార్లమెంట్ ఎన్నికలు పసుపు బోర్డు ఏర్పాటు కోసం జరిగితే ఈసారి మాత్రం పార్లమెంట్ పరిధిలోని చక్కెర కర్మాగారాలను తెరిపించడంతో పాటు గల్ప్ బోర్డు ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ఇదే అంశాన్ని మూడు ప్రధాన పక్షాలు తలకెత్తుకున్నాయి. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మహిళ ఓటర్లు ఎవరిని కరుణిస్తే వారిదే గెలుపు అని చెప్పాలి. ఓటర్ల తుది జాబితాలోనూ దాదాపు మహిళ ఓటర్లు 90 వేలు అధికంగా ఉండడం అందుకు ఉదాహరణగా చెప్పాలి. దాదాపు 9 లక్షల మహిళ ఓటర్లు ఉండగా వారిని ఎవరు ప్రసన్నం చేసుకుంటే వారే గెలుపు అని చెప్పవచ్చు.



Next Story

Most Viewed