నిధులు విడుదల.. ఏపీ మహిళల అకౌంట్‌లో డబ్బులు

by  |
cm-jagan mohanreddy
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ చేయూత రెండో ఏడాది నిధులు విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వరుసగా రెండో ఏడాది 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మట్లాడుతూ వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని, మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 సాయం అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అక్కచెల్లెమ్మలకు సాయం అందించడం గొప్పగా ఉందన్నారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా రెండేళ్లలో రూ.9వేల కోట్ల ఆర్ధిక సాయంతో పాటు జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్నామని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు.

అమూల్‌, రిలయన్స్‌, పీ అండ్‌ జీ, ఐటీసీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన 78వేల మంది అక్కచెల్లెమ్మలు కిరాణా షాపులు పెట్టుకోగా.. లక్షా 19వేల మహిళలు ఆవులు, గేదెలు కొనుగోలు చేశారని వెల్లడించారు. లీటర్‌ పాలకు అదనంగా రూ.15 వరకు లబ్ధి జరిగేలా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. కంపెనీలు, బ్యాంకులతో లబ్ధిదారుల అనుసంధానంపై కాల్ సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కేబినెట్‌లోనూ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు నామినేటెడ్‌ పదవుల విషయంలోనూ మహిళలకే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సీఎం జగన్‌ వివరించారు. ప్రతి రంగంలో అధిక శాతం మహిళలకు ప్రాతినిథ్యం కల్పించామని, వారి భద్రత కోసం దిశ, అభయం యాప్‌ తీసుకొచ్చామని తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశామని, వారి రక్షణకై దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులను నియమించామని, వారికోసం ప్రత్యేకంగా 900 మొబైల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశామని సీఎం జగన్‌ చెప్పారు.



Next Story

Most Viewed