నదాల్ కల నెరవేరేనా..?

by  |
నదాల్ కల నెరవేరేనా..?
X

దిశ, స్పోర్ట్స్ : రఫెల్ నదాల్… అతడు క్లే కోర్టులో దిగితే ప్రత్యర్థి తలొంచాల్సిందే. ఇప్పటికి 20 గ్రాండ్‌స్లామ్స్ సాధించిన ఈ స్పెయిన్ బుల్ రోలాండ్ గారోస్‌లోనే 13 టైటిల్స్ గెలిచాడంటే క్లే కోర్టులో అతడి ఆధిపత్యం ఎలా ఉంటుందో అర్దం చేసుకోవచ్చు. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ (20) గెలిచిన రోజర్ ఫెదరర్ సరసన నిలిచాడు. ఈ ఏడాది మొదట్లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 21వ గ్రాండ్‌స్లామ్ కోసం బరిలోకి దిగాడు. కానీ తనకు పెద్దగా కలసి రాని హార్డ్ కోర్టుపై క్వార్టర్‌ఫైనల్‌లోనే వెనుదిరిగాడు. ఇక మరోసారి మే 30 నుంచి ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్‌లోనే ఆ కలను నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు. రోలాండ్ గారోస్‌లో తనకు ఉన్న అద్భుతమైన రికార్డుతో 21వ గ్రాండ్‌స్లామ్ తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ ఇటీవల కాలంలో క్లేకోర్టులపై వరుసగా ఓటముల పాలు అవడం నదాల్ అభిమానులను కలవరపెడుతున్నది. ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు జరిగే మాంటెకార్లో మాస్టర్స్, బార్సిలోనా ఓపెన్, మాడ్రిడ్ ఓపెన్ వంటి క్లేకోర్టుల్లో నదాల్ ప్రదర్శన పేలవంగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.

క్లే కింగ్‌కు ఏమయ్యింది?

కరోనా, గాయాల కారణంగా రఫెల్ నదాల్ చాలా రోజులు కోర్టుకు దూరంగా ఉన్నాడు. గత ఏడాది జరిగిన యూఎస్ ఓపెన్‌లో కూడా పాల్గొనలేదు. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడిన రఫెల్ నదాల్ అద్భుతమైన ప్రదర్శన చేసి 20వ గ్రాండ్‌స్లామ్ ఎగరేసుకొని పోయాడు. ఇక ఆ తర్వాత వరుసగా ఓటములే రఫా ఖాతాలో చేరాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ క్వార్టర్ ఫైనల్‌లో మ్యాచ్ పాయింట్ వరకు వచ్చి స్టెఫానో సిట్సిపాస్ చేతిలో ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండు సెట్లు కోల్పోయి.. మూడో సెట్‌లో దాదాపు ఓటమి వరకు వచ్చిన సిట్సిపాస్ అద్బుతంగా తిరిగి ఆటలోకి వచ్చాడు. వరుసగా మూడు సెట్లు గెలిచి రఫాకు షాక్ ఇచ్చాడు. సరే అది హార్డ్ కోర్ట్ కదా అని అభిమానులు సర్దుకున్నారు. అయితే ఈ ఏడాది మాంటెకార్లో మాస్టర్స్‌ క్వార్టర్ ఫైనల్‌లో ఆండ్రీ రూబ్లేవ్‌ చేతిలో 2-6, 6-4, 2-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. మరో క్లే కోర్ట్ టోర్నీ ఫైనల్‌లో స్టెఫానో సిట్సిపాస్ మరోసారి నదాల్‌కు చుక్కలు చూపించాడు. దాదాపు మ్యాచ్‌ను రఫా నుంచి లాగేసుకున్నాడు. కానీ రఫా తిరిగి పుంజుకొని బార్సిలోనా ఓపెన్ గెలిచాడు. అయితే గత వారం మాడ్రిడ్ ఓపెన్‌లో మరోసారి చుక్కెదురైంది. 5వ సీజ్ అలగ్జాండర్ జ్వెరేవ్ చేతిలో 4-6, 4-6 తేడాతో ఓటమి పాలయ్యాడు. క్లే కోర్ట్ కింగ్ వరుసగా మట్టి కోర్టుల్లో ఓటమి పాలవడం అభిమానులకే కాక టెన్నిస్ పండితులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నది. కీలకమై ఫ్రెంచ్ ఓపెన్ ముందు జరిగిన మూడు క్లే కోర్ట్ టోర్నీల్లో నదాల్ ప్రదర్శన ఆందోళనకరంగా మారింది.

తిరిగి వస్తాడా?

రఫెల్ నదాల్ తన కెరీర్‌లో 48 మాస్టర్స్ 1000 టోర్నీలు ఆడాడు. క్లే కోర్టుల్లో జరిగిన ఈ టోర్నీల్లో దాదాపు 200 మ్యాచ్‌లు ఆడి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే ఇటీవల గాయం నుంచి కోలుకున్న తర్వాత అతడి ప్రదర్శన అంచనాలను అందుకోలేక పోతున్నాడు. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు జరుగుతున్న రోమ్ ఓపెన్‌లో తిరిగి తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. ‘రోమ్ ఓపెన్‌లో ఏం జరుగుతున్నదో చూడాలి. మాంటెకార్లోలో క్వార్టర్స్, బార్సిలోనాలో ఫైనల్స్, మాడ్రిడ్ ఓపెన్‌లో క్వార్టర్స్ చేరాను. ఫ్రెంచ్ ఓపెన్ ముందు ఇది నాకు నిజమైన పరీక్ష. ఒక విధంగా మాడ్రిడ్ ఓపెన్‌లో ఓడిపోవడం ద్వారా నాలోని లోపాలేవో తెలుసుకున్నాను. వాటిని సరిచేసుకొని ఫ్రెంచ్ ఓపెన్‌లో గట్టిగా పోరాడతాను’ అని నదాల్ అన్నాడు. రఫెల్ నదాల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి ఆల్ టై రికార్డు సాధించాలని అనుకుంటున్నాడు. అయితే అతడికి జ్వెరెవ్, సిట్సిపాస్, రూబ్లెవ్, థీమ్ వంటి యువ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. టెన్నిస్ కెరీర్‌లో ఎన్నో శిఖరాలు అధిగమించిన నదాల్.. ఈ సారి ఫ్రెంచ్ ఓపెన్ సాధించి తన కలను నెలవేర్చుకోవాలని భావిస్తున్నాడు.



Next Story

Most Viewed