ప్రాణాలకు తెగించి డ్రైవర్‌ను కాపాడిన సీఐ కిరణ్

by  |
Circle Inspector Kiran
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ డ్రైవర్‌ను కాపాడేందుకు ఓ సీఐ ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాటారం రహదారిలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మహాదేవపూర్ మండలం నుండి రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ఇసుకను లారీల్లో తరలిస్తుంటారు. ఈ క్రమంలో ఓ లారీ డ్రైవర్ ఇసుక లోడ్ నింపుకుని వెళ్తుండగా క్యాబిన్‌లో షాట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోయింది. ఓ కేసు విచారణ నిమిత్తం అటుగా వెళుతున్న మహదేవపూర్ సీఐ కిరణ్ వెంటనే లారీ ఎక్కి డోర్ తొలగించి డ్రైవర్‌ను బయటకు లాగారు. అనంతరం మంటలను ఆర్పివేశారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించి ప్రథమ చికిత్స చేసి రక్షించారు. సమయానికి లారీలోంచి బయటకు లాగడంతో బతికాడని, కాసేపు ఆలస్యమైనా ఆయన ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో చాకచక్యంగా డ్రైవర్ ప్రాణాలు కాపాడటమే కాకుండా, లారీ దగ్ధం కాకుండా వెంటనే మంటలు అదుపులోకి తీసుకున్న సీఐ కిరణ్‌ను స్థానికులందరూ అభినందించారు.

ప్రమాదాన్ని గమనించి వీడియోలు తీస్తోన్న స్థానికులు

లారీలో మంటలు చెలరేగడాన్ని గమనించిన కొంతమంది స్థానికులు ఫోన్‌లలో వీడియోలు తీయడానికే చూశారు తప్పా, ఒక్కరూ కూడా డ్రైవర్‌ను కాపాడే ప్రయత్నం చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయానికి సీఐ కిరణ్ అటుగా వెళ్లకపోయినా.. ప్రమాదాన్ని గమనించకపోయినా డ్రైవర్ మరణించే వాడని స్థానికులు వెల్లడించారు. ఏది ఏమైనా సీఐ కిరణ్ తీసుకున్న చొరవను చూసిన ప్రతిఒక్కరూ అభినందనల్లో ముంచెత్తారు.



Next Story

Most Viewed