ఆ పని చేసిన తొలి చైనా మహిళగా ‘వాంగ్ యాపింగ్’ రికార్డ్!

by  |
ఆ పని చేసిన తొలి చైనా మహిళగా ‘వాంగ్ యాపింగ్’ రికార్డ్!
X

దిశ, ఫీచర్స్ : అక్టోబరు 16న చైనా ‘షెన్‌జౌ-13’ అంతరిక్ష నౌకను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఆ దేశం సొంతంగా నిర్మించుకుంటున్న ‘తియాన్‌గోంగ్’ అంత‌రిక్ష పరిశోధనా కేంద్రానికి సాయపడేందుకు ఆరు నెలల మిషన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములు అక్కడికి వెళ్లారు. వీరిలో వాంగ్ యాపింగ్ ఒకరు కాగా.. నిర్మాణంలో ఉన్న స్పేస్ సెంటర్ నుంచి బయటకొచ్చిన ఆమె, తన కొలీగ్ జయ్ జిగాంగ్‌తో కలిసి ఆరు గంటలకు పైగా ఎక్స్‌ట్రా వెహికల్ యాక్టివిటీస్‌లో పాల్గొంది. గ్రూప్‌లోని మూడో సభ్యుడైన యే గ్వాంగ్‌ఫు స్టేషన్ లోపలి నుంచే వారికి సాయమందించాడు. ఈ మేరకు వాంగ్ యాపింగ్ అంతరిక్షంలో నడిచిన మొదటి చైనీస్ మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని(ఐఎస్‌ఎస్) వేర్వేరు దేశాలకు చెందిన స్పేస్ రీసెర్చర్స్ ఉమ్మడిగా వినియోగించుకుంటున్నారు. ఏ దేశమైనా సొంతంగా ఇటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కష్టసాధ్యం(ఒకప్పుడు దీని నిర్మాణానికి 35-160 బిలియన్ డాలర్లు ఖర్చయింది). కాగా ఇప్పుడు ఏ దేశం చేయని సాహసానికి పూనుకున్న చైనా సొంతంగా అలాంటి స్టేషన్‌ను నిర్మిస్తోంది. ఇందులో భాగంగానే ఆస్ట్రోనాట్స్‌ను అక్కడికి పంపిస్తుండగా.. ముగ్గురు సభ్యులతో కూడిన బృందం అక్టోబర్‌లో అంతరిక్షానికి వెళ్లింది. ఈ క్రమంలోనే టియాన్హే కోర్ మాడ్యూల్ నుంచి బయటకెళ్లిన వాంగ్ యాపింగ్ అనే మహిళా ఆస్ట్రోనాట్.. 6.5 గంటల పాటు స్పేస్‌వాక్‌ చేసి సక్సెస్‌ఫుల్‌గా తిరిగొచ్చింది. దీంతో చైనా అంతరిక్ష చరిత్రలో మహిళా వ్యోమగామి పాల్గొన్న తొలి స్పేస్‌వాక్ ఇదేనని ‘చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ’ ప్రకటించింది.

చైనా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్..

స్పేస్ స్టేషన్‌‌లోని ‘టియాన్హే మాడ్యూల్’ వచ్చే ఏడాది ‘మెంగ్టియాన్, వెంటియన్’ అనే మరో రెండు విభాగాలకు అనుసంధానించబడుతుంది. పూర్తయిన స్టేషన్ దాదాపు 66 టన్నుల బరువు ఉంటుంది. ఇది 1998లో మొదటి మాడ్యూల్‌ను ప్రారంభించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కంటే చాలా చిన్నది. ఈ మిషన్ దేశీయంగా అభివృద్ధి చేసిన కొత్త-తరం ఎక్స్‌ట్రావెహిక్యులర్ స్పేస్‌సూట్‌ల పనితీరు, ఆస్ట్రోనాట్స్, మెకానికల్ ఆర్మ్ మధ్య సమన్వయం‌తో పాటు పలు పరికరాల పనితీరును సమీక్షించింది. మార్స్, మూన్ మిషన్ల తర్వాత చైనా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇదే కాగా.. ఆ దేశ అంతరిక్ష చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మానవ సహిత మిషన్ కూడా ఇదే.

ఇక రెండు విభాగాలుగా ఉన్న ISSలో ‘రష్యన్ ఆర్బిటల్ సెగ్మెంట్(ROS)’ను రష్యా ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా.. యునైటెడ్ స్టేట్స్ ఆర్బిటల్ సెగ్మెంట్(USOS)‌ను అమెరికా, జపాన్, కెనడా సహా అనేక ఇతర దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి. కాగా, చైనా సొంతంగా నిర్మిస్తున్న స్పేస్ స్టేషన్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని చైనా స్పేస్ అధికారులు చెబుతున్నారు.

కార్గిల్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ.. ఎందుకో తెలుసా?



Next Story