వీడని చిన్నారి మృతి కేసు మిస్టరీ.. మూడు కమిషనరేట్ల పరిధిలో మిస్సింగ్ కేసులపై ఆరా!

by  |
child death case
X

దిశ, ఖైరతాబాద్: దీపావళి పండుగ వేళ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన చిన్నారి మృతి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రత్యేక బృందాలు విడిపోయి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేసినా చిన్నారి ఎవరన్నది ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గురువారం పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలోని ఓ మూసివున్న షటర్ ఎదుట చిన్నారి మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. సుమారు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్-1 వైపునుంచి పంజాగుట్ట వైపు వెళ్లే రహదారికి సమీపంలో ఓ చిన్నారి నిర్జీవంగా పడి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి వివరాల కోసం నిన్నటినుంచి ఆరా తీస్తున్నారు.

చివరకు డాగ్ స్క్వాడ్‌ను రప్పించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో క్లూస్ టీం రంగంలోకి వచ్చి చిన్నారిని పూర్తిగా పరిశీలించి కుడి చేతికి, ముఖానికి స్వల్పంగా గాయాలైనట్లు గుర్తించారు. చిన్నారి పడివున్న ప్రాంతానికి సమీపంలోనే సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదు. దీంతో కేసును ఛేదించడం పోలీసులకు కష్టతరంగా మారింది. మూడు కమిషనరేట్ల పరిధిలో చిన్నారి మిస్సింగ్ కేసును పరిశీలిస్తున్నారు. 24 గంటలు అయినా చిన్నారి ఎవరో తెలియక పోవడం, కేసుకు సంబంధించిన ఏ ఒక్క ఆధారం లభించకపోవడంతో పంజాగుట్ట పోలీసులు మృతి చెందిన చిన్నారిని గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed