‘ధరణి’ దేశానికి ట్రెండ్ సెట్టర్ : కేసీఆర్

by  |
‘ధరణి’ దేశానికి ట్రెండ్ సెట్టర్ : కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈరోజు నుంచే ధరణి పోర్టల్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. నవంబర్ 2వ తేదీ నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. సులభంగా, పాదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోందని వెల్లడించారు. అంతేగాకుండా తెలంగాణ పోరాట యోధుడు వీరారెడ్డి పుట్టిన గ్రామం మూడుచింతలపల్లి అని అన్నారు. వీరారెడ్డి ఈ గ్రామమైనందునే మూడు చింతలపల్లిని ఎంపిక చేశా అని తెలిపారు. ఈ ధరణి పోర్టల్ దేశానికే ట్రెండ్ సెట్టర్ అవుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పది నిముషాల్లో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ జరుగుతుందని సూచించారు. ఆధార్ నెంబర్‌తోనే అన్ని వివరాలు నమోదు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంతేగాకుండా రెవెన్యూ అధికారుల హోదా కూడా పెరిగిందని అన్నారు.

ఈ ధరణి పోర్టల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవానికి, ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికిందని వెల్లడించారు. తెలంగాణ రైతుల భూముల సంపూర్ణ రక్షణే ధరణి పోర్టల్ లక్ష్యం అన్నారు. రాష్ట్రానికి గమనం, దిశ, దిక్సూచి, ఇవ్వాల్సిన బాధత్య తనపై ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. గతంలో వ్యవసాయం చేయాలంటే.. రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం 24 గంటల ఉచిత విద్యుత్‌తో, అందరికీ సాగునీరు అందిస్తున్నామని అన్నారు. అంతేగాకుడా భారతదేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని తెలియజేశారు. దేశంలో 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతుల కోసం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినా… ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పు చేసే అధికారం తనకు లేదని, తాను ఒక్క తప్పు చేసినా… ఎన్నో తరాలు ఇబ్బందులు పడతాయని వెల్లడించారు. రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నాం… మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీరందిచామని అన్నారు. దేశానికి తెలంగాణ 55 శాతం వడ్లు సరఫరా చేసిందని గుర్తు చేశారు. అంతేగాకుండా గతంలో మనది వెనుకబడిన ప్రాంతం కాదని.. వెనక్కు పడేయబడ్డ ప్రాంతం అని గుర్తు చేశారు. తలసరి ఆదాయంలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందని సూచించారు. ధరణి పోర్టల్ పూర్తి పారదర్శకంగా ఉందని వెల్లడించారు. ఇందులో 1,45,58,000 ఎకరాల భూముల వివరాలు ఇప్పటికే పొందుపర్చామని తెలిపారు. 200పైగా సమావేశాల్లో అధికారులతో సుదీర్ఘంగా చర్చింది, ధరణి పోర్టల్ తీసుకొచ్చామని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ రిజిస్ట్రేషన్లు ఉండవని స్పష్టం చేశారు. కొనుగోళ్లు, అమ్మకాలు నిమిషాల్లో జరుగుతాయని, ఇప్పటికే 570 తహసీల్దార్ ఆఫీస్‌లను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లుగా మార్చామని తెలిపారు.

నమూనా పత్రాలు కూడా ఇప్పటికే ధరణిలో పొందుపర్చామని, డాక్యుమెంట్ రైటర్లను కూడా త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. పాత రిజిస్ట్రేషన్ చార్చీలనే ఇప్పుడూ వసూలు చేస్తారని, ప్రభుత్వం నిర్ణయించిన విలువ ప్రకారమే దానికి వసూలు చేస్తారని వెల్లడించారు. కరోనా వచ్చి రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, అయినా సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని అన్నారు. కేసీఆర్ బతికి ఉన్నంతకాలం రాష్ట్రంలో రైతుబంధు పథకం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. రైతుకు అప్పులన్నీ తీరి, సొంతపెట్టుబడి పెట్టుకునే రోజులు రావాలని, అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని అన్నారు. అందుకే రైతులు అధికారులకు సహకరించాలని సూచించారు. ప్రతి భూమికి ఆక్షాంశాలు, రేఖాంశాలు నిర్ణయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ సూపర్ హిట్ అవుతుందని, ఇతర రాష్ట్రాలపై కూడా ఒత్తిడి వస్తుందని అన్నారు. గిరిజన రైతుల పోడు భూముల సమస్య కూడా త్వరలోనే పరిష్కరిస్తామని, పట్టాలు కూడా త్వరలోనే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed