చేయూత రూ.75 వేలు ఒకేసారి మంజూరు -అప్పలరాజు 

by  |
చేయూత రూ.75 వేలు ఒకేసారి మంజూరు -అప్పలరాజు 
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో విడతల వారీగా ఇచ్చే రూ.75 వేల మొత్తాన్ని… ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల ద్వారా మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యకార శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఒకేసారి అందే ఆర్థిక సాయంతో మహిళలు ఆర్థిక సుస్థిరta సాధించడానికి అవకాశం కలుగుతుందన్నారు. సచివాలయంలో నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు.

ముఖ్యంగా వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల వల్ల అందే ఆర్థిక సాయంతో మహిళలు స్వయం ఉపాధి పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా తమ శాఖ ద్వారా పలు యూనిట్ల స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి అప్పలరాజు తెలిపారు. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల కింద పెద్ద ఎత్తున డెయిరీ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ యూనిట్ల కింద ఆవులు, గేదెల పెంపకంతో పాటు పడ్డలు, దూడల పెంపకం యూనిట్లను ప్రోత్సహిస్తామన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న పాలులో 80 శాతానికి పైగా అసంఘటిత రంగం ద్వారా సేకరిస్తున్నట్లు తెలిపారు. కేవలం 20 శాతం పాలు మాత్రమే సంఘటిత రంగం ద్వారా సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తయిన పాలును సంఘటిత రంగం నుంచే కొనుగోలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే అమూల్ (amul) కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు.

వైఎస్సార్ చేయూత కింద లబ్ధి పొందే మహిళలు సంప్రదాయ యూనిట్లైన పశువులు, గొర్రెలు, మేకల పెంపకం, టైలరింగ్, కిరాణా తదితర యూనిట్లు ఏర్పాటు చేసుకొవొచ్చని చెప్పారు. వాటితో పాటు మొక్క జొన్న దాణా, డిస్టలరీల వృథా నుంచి దాణా ఉత్పత్తి యూనిట్లు, సంప్రదాయ తెప్పలకు(పడవలు) ఇంజన్లు అమర్చడం వంటి యూనిట్ల ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. ఆవుల పెంపకానికి 1,51,091 దరఖాస్తులు, గేదెల పెంపకం యూనిట్లకు 1,57,000, గొర్రెలకు రూ.1,04,300, మేకలకు 62,900, కిరణా ఇతర వ్యాపార యూనిట్లకు 12,81,067 దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి అప్పలరాజు వెల్లడించారు.

Next Story

Most Viewed