‘నేరగాళ్లకు భయపడే ప్రసక్తే లేదు’

by  |
‘నేరగాళ్లకు భయపడే ప్రసక్తే లేదు’
X

దిశ, ఏపీ బ్యూరో: నేరస్తుడు పాలకుడైతే నిరపరాధులు జైళ్లో ఉంటారని చెప్పిన ఫెడరల్ కాస్ట్రో మాటలే నేడు ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్నాయనీ, కానీ, అలాంటి నేరగాళ్లకు తాము భయపడే ప్రసక్తే లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి చేస్తున్న అక్రమ అరెస్టులపై ‘మానవ హక్కుల కమిషన్’(హెచ్‌ఆర్‌సీ)కి ఫిర్యాదు చేస్తామని అన్నారు.

ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు రాష్ట్రంలోని టీడీపీ నేతలతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గాలకు అంతులేకుండా పోయిందనీ, ప్రలోభాలకు లొంగకుండా పార్టీ మారని నేతలపై కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జెసీ ఫ్రభాకర్‌రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్‌రెడ్డిల అక్రమ అరెస్టులపై హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

జగన్‌ ఏడాది పాలనలో అన్నీ ప్రజావ్యతిరేక నిర్ణయాలే తీసుకున్నారని, ప్రజావ్యతిరేక పాలన కాబట్టే కోర్టులు కూడా అనేక జీవోలను రద్దు చేశాయని తెలిపారు. కోర్టు తీర్పులతో జగన్‌ ప్రస్ట్రేషన్‌కు వెళ్లారనీ, ఆ అసహనంతోనే జగన్‌ అక్కసు రెట్టింపు అయిందని మండిపడ్డారు. తాను జైలుకు వెళ్లాను కాబట్టి అందరూ జైలుకు వెళ్లాలనేది జగన్‌ అక్కసు అని, ఇందులో భాగంగానే టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి, అక్రమ అరెస్ట్‌లు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్‌ యించుకున్న వ్యక్తిని 24గంటలు కార్లో తిప్పడం రాక్షస పాలనకు నిదర్శనమన్నారు. వైసీపీ దుశ్చర్యల వల్లే అచ్చెన్నాయుడుకి రెండోసారి ఆపరేషన్‌ చేసే పరిస్థితి తలెత్తిందన్నారు. తప్పుచేసిన నాయకుడిని, అధికారులను వదిలే ప్రసక్తే లేదన్నారు.

పరిపాలన అంటే ప్రతీకారం తీర్చుకోవడమా?

విచారణ జరుగుతున్న టెలీ మెడిసిన్‌ కాంట్రాక్టర్‌కు జగన్‌ ప్రభుత్వం రూ.3కోట్లు ఏ విధంగా చెల్లించిందనీ, చెల్లింపులు చేసిన మంత్రిని అరెస్ట్‌ చేస్తారా అంటూ చంద్రబాబు నిలదీశారు. పరిపాలన అంటే ప్రతీకారం తీర్చుకోవడమా? అధికారమంటే అక్రమ కేసులు పెట్టడమా? అని ప్రశ్నించారు. తప్పుడు ఫిర్యాదులు చేసి, ఫ్యాబ్రికేటెడ్‌ పేపర్లు పెట్టి పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చి మరీ అరెస్ట్‌లు చేయిస్తున్న కక్ష సాధింపు పాలన
దేశంలో ఎక్కడా లేదని మండిపడ్డారు. కరోనా సంక్షోభంలోనూ పగ, ప్రతీకారాలు తీర్చుకుంటున్న కిరాతక చరిత్ర జగన్‌దేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లినా అడ్డుకుంటుండటం దారుణమన్నారు.

‘సొంత మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు, సిబ్బందికి ప్రభుత్వ జీతాలా ? ప్రభుత్వ పనులకు జగన్‌ కంపెనీ సిమెంట్‌ కొనాలా ? ఇంతకన్నా అధికార దుర్వినియోగం ఉంటుందా’ అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగంపై సీఎంగా ప్రమాణం చేసిన జగన్ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రతినబూనిన జగన్ ఇప్పుడు స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారన్నారు.

Next Story

Most Viewed