వైజాగ్ టూర్‌లో బాబుకు అవమానం

by  |
వైజాగ్ టూర్‌లో బాబుకు అవమానం
X

సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆరుపదులు దాటిన వయసు, రాష్ట్రానికి గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి ఇవేవీ వైఎస్సార్సీపీ కార్యకర్తలకు కనిపించలేదు. అమరావతిపై వల్లమాలిన ప్రేమ చూపించడాన్ని వైజాగ్ వైఎస్సార్సీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో బాబు ఉత్తరాంధ్ర టూర్‌ను ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా నేడు చోటుచేసుకున్న పరిణామాలు బాబును ఇబ్బందిపెట్టాయి.

గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి వైజాగ్ చేరుకున్న చంద్రబాబునాయుడుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అయితే ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు రాగానే వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసనతో అడ్డుపడ్డాయి. ఎయిర్‌పోర్టు మొదలు ఎన్ఏడీ జంక్షన్ వరకు అడుగడుగునా వైఎస్సార్సీపీ నేతలు బాబు కాన్వాయ్‌కి అడ్డంగా పడుకున్నారు. ఒకదశలో బాబు వాహనంపై కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. మరికొంతమంది చెప్పులు చూపిస్తూ నినాదాలు చేశారు. దీంతో కాన్వాయ్ ముందుకు కదలలేదు. వెంటనే బాబు వాహనం నుంచి కిందికి దిగి నడుచుకుంటూ ముందుకు కదిలారు. ఇంతలో పోలీసులు వారిని అడ్డుతొలగించడంతో కాన్వాయ్ నెమ్మదిగా కదిలింది.

దీనిపై టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. “రాళ్లు విసురుతూ చంద్రబాబుగారిని గాయపరిచే ప్రయత్నం చేస్తున్న వైసీపీ గూండాలు.. తమ చర్యలను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా దాడి చేశారు. ఎమ్మెల్యే రామకృష్ణబాబు కారు పగలకొట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఎందుకున్నారు? తాడేపల్లి ఇంటినుంచి వస్తున్న ఆదేశాలు కారణమా? ప్రశాంత విశాఖలో చెప్పింది చేసిన వైఎస్సార్సీపీ పులివెందుల దొంగల ముఠా. విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్సార్సీపీ మూకలు వీరంగం సృష్టించాయి. అడ్డుకోవాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు” అంటూ ట్వీట్ చేసింది.

దీనిపై యనమల యనమల మాట్లాడుతూ, విశాఖలో జగన్ చేసిన భూకబ్జాలు బయటపడతాయనే వైఎస్సార్సీపీ నేతలు భయపడుతున్నారని అన్నారు. బాబు కాన్వాయ్‌పై వైఎస్సార్సీపీ నేతలు దాడికి పాల్పడడం హేయమైన చర్య అని అన్నారు.

అశోక్‌గజపతి రాజు మాట్లాడుతూ, అక్రమాలు ఎక్కడ జరిగినా అక్కడకు వెళ్లి చూడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతకు ఉందని అన్నారు. ప్రజల వద్దకు ప్రతిపక్ష నాయకుడ్ని వెళ్లకుండా చేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నేతలే బాబు టూర్‌ను అడ్డుకోవాలని చెప్పడం, చెప్పులు, కోడిగుడ్లు సరఫరా చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు.

వర్ల రామయ్య ట్విట్టర్ మాధ్యమంగా ఈ రోజు విశాఖలో జరిగింది చూడండి. వైసీపీ అడ్డుకుంటోంది.. చంద్రబాబుని అడుగు పెట్టనివ్వబోమని అంటున్నారు. పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారు. ఎందుకు రోడ్లపైకి రానిచ్చారు? చంద్రబాబు పర్యటనకు ఆటంకం కలిగిస్తారని పోలీసులకు తెలుసు. అయినప్పటికీ వైసీపీ కార్యకర్తలను ఎందుకు అడ్డుకోలేదు? వారిని ఎందుకు గృహ నిర్బంధం చేయలేదు? ఏపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇదే రకమైన పరిస్థితులు కొనసాగితే ఎలా? ఈ రకమైన పరిస్థితి కొనసాగితే ఏపీ ప్రజల భవిష్యత్తును ఆ దేవుడే కాపాడాలి’ అంటూ ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed