ఎందుకంత దుర్మార్గం.. ఎంత అవమానించాలో అంత అవమానించారు: బాబు

by  |
ఎందుకంత దుర్మార్గం.. ఎంత అవమానించాలో అంత అవమానించారు: బాబు
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుని ఎంత దుర్మార్గంగా అరెస్టు చేశారో రాష్ట్రం మొత్తం చూసిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడుని ఎంత అవమానించాలో వైఎస్సార్సీపీ నేతలు అంత దారుణంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంబోతన్నారు.. బంట్రోతన్నారు.. ఆకారం పెరగడం కాదు బుర్ర పెరగాలని సాక్షాత్తూ సీఎం అన్నారని ఆయన గుర్తు చేశారు. ఇన్ని చేసినా ప్రజల కోసం అచ్చెన్న అనునిత్యం పోరాడాడు. ఇసుక మాఫియా అంశంలో, మద్యం విషయంలో పోరాడుతున్నాడని ఆయన మద్దతు పలికారు. ఆరోగ్యం బాగాలేదు, టాబ్లెట్లు తీసుకుని భార్యకు చెప్పివస్తానన్న వ్యక్తిని ఎందుకంత బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చిందని ఆయన మండిపడ్డారు. ఒక ప్రజా ప్రతినిధిని ఎందుకంత దుర్మార్గంగా అరెస్టు చేయాల్సి వచ్చిందని ఆయన నిలదీశారు.

14 ఏళ్లు పాటు తాను కూడా సీఎంగా పనిచేశానన్న ఆయన, ఇంత దుర్మార్గాన్ని ఏనాడూ చూడలేదని అన్నారు. నేరస్థుడే ముఖ్యమంత్రి అయితే, అధికారులు అతని చేతిలో పావులుగా మారడం ఎంతో బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. అక్రమ మైనింగ్, భూదందాలపై పోరాడినందువల్లే అచ్చెన్నను వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. వారి పిల్లలు అక్కడే ఉన్న సమయంలో బెడ్ రూం, బాత్రూమ్‌లోకి వెళ్లి అరెస్టు చేశారని అన్నారు. తండ్రిని అలా చేస్తే చదువుకున్న పిల్లల మనోభావాలు దెబ్బతినవా? అంటూ ప్రశ్నించారు. ఒక్క చాన్స్ అంటూ వచ్చి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైఎస్సార్సీపీ చెబుతున్నవి నవరత్నాలు కాదని.. నవమోసాలు అని ఎద్దేవా చేశారు.

అచ్చెన్నాయుడికి రెండ్రోజుల కిందట పైల్స్ ఆపరేషన్ జరిగిందని, అలాంటి వ్యక్తిని బలవంతంగా తీసుకెళతారా అంటూ మండిపడ్డారు. ఎక్కడికి తీసుకెళుతున్నారో ఎవరికీ చెప్పకుండా, ఎక్కడెక్కడో తిప్పి, చివరికి విజయవాడ తీసుకొస్తారా? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. మీ కక్ష సాధింపు చర్యలకు అంతులేదా? అంటూ ప్రశ్నించారు. విచారణకు పిలిస్తే రానన్నాడా? నోటీసులిస్తే స్పందించలేదా? అచ్చెన్నాయుడు చేసిన నేరం ఏంటి? అధికారం ఉంది కదా అని ఉన్మాదుల్లా ప్రవర్తిస్తే ఆటలు సాగుతాయనుకుంటున్నారా? అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అచ్చెన్నాయుడుపై ఆరోపణలన్నీ కల్పితాలేనని ఆయన విమర్శించారు. విజిలెన్స్ రిపోర్టులో ఎక్కడా అచ్చెన్నాయుడు పేరు లేదని, ఐఎంఎస్ డైరెక్టర్లు రవికుమార్, రమేశ్, విజయ్‌ల పేర్లు మాత్రమే ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్లాన్ ప్రకారం అచ్చెన్నను అరెస్టు చేయకపోతే, అరెస్టు విషయం వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ఒక రోజు ముందే ఎలా ప్రచారం చేయగలిగింది? అంటూ నిలదీశారు. అరెస్టు చేసి, చేతి రాత లెటర్‌తో అరెస్టు సమాచారం ఇస్తారా? అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Next Story

Most Viewed