కరోనా నియంత్రణకు కమ్యూనిటీ సహకారం కీలకం

by  |
కరోనా నియంత్రణకు కమ్యూనిటీ సహకారం కీలకం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనాను నియంత్రించడంలో క‌మ్యూనిటీ స‌హ‌కారం చాలా కీల‌క‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వ సంయుక్త కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో బుధవారం కేంద్ర బృందం స‌భ్యులు వికాస్ గాడే, ర‌వీంద‌ర్‌ల‌తో క‌లిసి నిర్వ‌హించిన స‌మావేశంలో కొవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌లపై చ‌ర్చించారు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌కు దాదాపు పూర్తిగా మిన‌హాయింపులు ఇచ్చార‌ని, ఇదేవిధంగా కేసుల సంఖ్య న‌మోదైతే జూలై 31వ‌ర‌కు ప‌రిస్థితి తీవ్రమవుతుందని వారు అభిప్రాయ‌ప‌డ్డారు. ఢిల్లీ, ముంబయి, చెన్నైలో ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల‌లో కొవిడ్‌-19 ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారని, ప్రైవేట్‌గా నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో 70శాతం పైబ‌డి పాజిటివ్ కేసులు వ‌స్తున్న‌ాయని తెలిపారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో గుర్తించిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, సంబంధిత కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్‌కు అనుస‌రిస్తున్న ప‌ద్ధతి, ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ఉన్న స‌దుపాయాలు, ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌, హోం ఐసోలేష‌న్‌, కంటైన్‌మెంట్ అంశాల గురించి వివ‌రంగా చ‌ర్చించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కొవిడ్‌-19 వ్యాప్తిని నియంత్రించేందుకు హోం కంటైన్‌మెంట్ మాత్ర‌మే అందుబాటులో ఉన్న ఏకైక మార్గ‌మ‌ని సంజ‌య్ జాజు తెలిపారు. ప్ర‌స్తుతం రోజుకు 100 కేసుల‌కంటే ఎక్కువ‌గా నిర్థార‌ణ అవుతున్నందున జీహెచ్‌ఎంసీ ప‌రిధిలోనే నాలుగు జిల్లాల క‌లెక్ట‌ర్లు, వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు, డిప్యూటీ క‌మిష‌న‌ర్ల‌తో వాట్స‌ప్ గ్రూప్‌ను ఏర్పాటుచేసి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారాన్నితీసుకుంటూ, స‌మ‌న్వ‌యాన్ని పెంచాల‌ని సూచించారు. కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌లు, స‌హ‌కారాన్ని పొందుట‌కు సంబంధిత వాట్స‌ప్ గ్రూప్‌లో ప్ర‌జారోగ్య సంచాల‌కుల‌తో పాటు త‌న‌ను కూడా చేర్చాల‌ని తెలిపారు. కొవిడ్‌-19 కంట్రోల్ రూం చేస్తున్న విధుల గురించి కూడా సంజ‌య్ జాజు వాక‌బు చేశారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్‌, హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ శ్వేత‌మ‌హంతి, జీహెచ్ఎంసీ అద‌న‌పు క‌మిష‌న‌ర్ బి.సంతోష్‌, సీసీపీ దేవేంద‌ర్‌రెడ్డి, కోవిడ్‌-19 కంట్రోల్ రూం ఓఎస్‌డీ అనురాధ‌ పాల్గొన్నారు.



Next Story

Most Viewed