‘సింగరేణి’ని మింగే కుట్ర!

by  |
‘సింగరేణి’ని మింగే కుట్ర!
X

సిరుల మాగాణిగా విరాజిల్లుతున్న సింగరేణి వందేళ్ల చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించింది. ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. తట్ట, చెమ్మాస్ నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతూ లాభాల బాటలో పయనిస్తోంది. ఎంతో మంది కార్మికులను అక్కున చేర్చుకుంది. ఎన్నో రాష్ట్రాలలో వెలుగులకు కారణమైంది. ఎన్నో మైలు రాళ్లు దాటింది. అలాంటి సింగరేణికి ఇప్పుడు పెద్ద ముప్పే వచ్చి పడింది. కేంద్ర ప్రభుత్వం గనులను ప్రైవేట్ పరం చేస్తుంటే, అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లతో పని చేయిస్తోంది. కార్మికులను ఔట్ సోర్సింగ్ పేరుతో నింపేస్తోంది.

దిశ, ఖమ్మం ప్రతినిధి: ఇప్పటికే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను, గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కొత్తగా వచ్చే బొగ్గు బ్లాకులను కూడా కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు సిద్ధపడుతోంది. బొగ్గు కొరతను తీర్చడం, ఉత్పతి.. విదేశీ బొగ్గు దిగుమతిని తగ్గించే పేరుతో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జాతీయస్థాయిలో కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పడు కోలిండియా సబ్సిడరీ సంస్థలు బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయి. తెలంగాణలో మాత్రం గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో సింగరేణి సంస్థ మాత్రమే బొగ్గును వెలికితీస్తుంది. ఏటా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ లాభాలు ఆర్జిస్తోంది. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంది. వివిధ రాష్ట్రాలకే కాకుండా, కేంద్రానికి చెందిన ఎన్టీపీసీకి నిత్యం 40వేల టన్నుల బొగ్గును సింగరేణి సరఫరా చేస్తోంది. జెన్కోకు కూడా భారీగా బొగ్గు అందిస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సింగరేణి మనుగడ ప్రశ్నార్థం కానుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 500 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. వేలం ప్రక్రియ కూడా మొదలు పట్టింది. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు, జాతీయస్థాయి కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు ఎంత చెప్పినా కేంద్రం ముందుకే సాగడంపై పెద్ద దుమారమే రేగుతోంది. భూపాలపల్లి, కుమ్రం భీం, భద్రాద్రి జిల్లాలలో సింగరేణి ప్రతిపాదించిన తొమ్మిది బొగ్గు గనులు కేంద్రం ప్రైవేటీకరించే బ్లాకులలోనే ఉన్నాయి. అవి సింగరేణికి దక్కుతాయో దక్కదో తెలియదు.

లాభాలు ఆర్జిస్తున్న వేళ

ప్రస్తుతం సింగరేణిలో 28 అండర్‌గ్రౌండ్‌, 18 ఓపెన్‌ కాస్టులలో ఉత్పత్తి కొనసాగుతోంది. వచ్చే పదేళ్లలో కొత్తగా 14 ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లు, ఎనిమిది భూగర్భ గనులను ప్రారంభించేందుకు రూ.వేయి కోట్ల అంచనాతో ప్లాన్‌‌ రెడీ చేసింది. ఇప్పటికే ఒడిశాలో నైనీ బ్లాక్‌‌‌‌ను, న్యూపాత్రపాద బ్లాక్‌ను సొంతం చేసుకుంది. 350 మిలియన్‌‌‌‌ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న నైనీ బ్లాక్‌‌ను డెవలప్‌‌ చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుంది. దీనికి 15 కిలోమీటర్ల దూరంలో న్యూపాత్రపాద బ్లాక్‌‌‌‌లో 1,040 మిలియన్‌‌‌‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉండగా, ఏటా 20 మిలియన్‌‌‌‌ టన్నుల బొగ్గును తవ్వేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాబోయే ఐదేళ్లలో ఏటా 100 టన్నుల బొగ్గును వెలికితీయాలనే టార్గెట్‌ పెట్టుకుంది. భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు సింగరేణి అధీనంలో ఉంటాయా లేదా అనేది అనుమానమే. థర్మల్‌ విద్యుత్‌కు పోటీగా సౌర, పవన, జల విద్యుత్‌ లాంటి ఉత్పాదక ఇంధనాల ప్రాధాన్యం పెరగడం, బొగ్గు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపనుందని అంటున్నారు.

భవిష్యత్ ఆందోళనకరం

రాష్ట్రంలో సింగరేణి తప్ప మరే సంస్థ బొగ్గు తవ్వేందుకు వీలు లేదు. ఇపుడు కేంద్రం నిర్ణయంతో బ్లాకులను దక్కించుకున్న ఏ సంస్థ అయినా బొగ్గును వెలికితీయవచ్చు. సింగరేణి కన్నా తక్కువ ధరకు విక్రయిస్తే, సింగరేణి వద్ద తీసుకునేవారు ఎవరూ ఉండరు. వారు అత్యాధునిక పరికరాలతో నాణ్యమైన బొగ్గును వెలికితీయవచ్చు. ఫలితంగా సింగరేణి నష్టాల ఊబిలో కూరుకుపోయే ఆస్కారం ఉంది. కొత్తగా ఉద్యోగాలు ఉండవు, బోనస్ లు, ఇంక్రిమెంట్లు, కారుణ్య నియామకాలు, మెడికల్ బోర్డులు ఉండవు. నష్టాలు ఎక్కువయితే సింగరేణి ఆధ్వర్యంలో నడిచే ప్రస్తుత బ్లాకులను కూడా ప్రైవేట్ పరం చేసి సంస్థ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. వేల మంది కార్మికుల ఉద్యోగాలకు ప్రమాదం వాటిల్లుతుంది. సింగరేణి వెలికి తీసే బొగ్గులో దాదాపు 80 శాతం పవర్ ప్లాంట్లకే విక్రయిస్తుంది. ఎన్టీపీసీ, జెన్కో లాంటి పెద్దపెద్ద సంస్థలే బొగ్గు బ్లాకులను దక్కించుకుంటే సింగరేణి బొగ్గును కొనడానికి ఎవరూ ముందుకు రారు. ఫలితంగా వందేళ్ల సింగరేణి ప్రస్థానం ముగించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

శ్రమ దోపిడీ తప్పదు

బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తే ముఖ్యంగా జరిగేది కార్మికుల శ్రమ దోపిడీ.. ఉద్యోగ భద్రత కూడా కరువవుతుంది. కార్మికుల స్థానంలో అత్యాధునిక పరికరాలు వస్తాయి. విదేశీ టెక్నాలజీని ఉపయోగించే అవకాశమే ఎక్కవగా ఉంటుంది. ఉద్యోగాల కల్పన ఉండదు. ఉన్నా తక్కువ జీతంతో ఎక్కువగా పనిచేయించడం, ఒత్తిడిని పెంచడం లాంటివి చేస్తారు. వారి భద్రతకు ఎలాంటి రక్షణ చర్యలు ఉండవు. పనివేళలతో సంబంధం లేకుండా ఉంటుంది. కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. కేంద్రానికి ముందుగా సపోర్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే సింగరేణిలోని దాదాపు అన్ని విభాగాలలో బయటి వ్యక్తులతో పనిచేయిస్తోంది. దీంతో కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కంటే ముందే అలాంటి చర్యలకు పూనుకోదడంతో లక్షకు పైగా ఉండే కార్మికుల సంఖ్య దాదాపు 40 వేలకు పడిపోయింది. పెద్దల ప్రోత్సాహంతో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, నిధులు పక్కదారి పడుతున్నాయని కూడా ఆరోపిస్తున్నారు. సింగరేణిని మింగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని చెబుతున్నారు.

భవిష్యత్ లో సింగరేణి కనుమరుగే : వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి

కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తోంది. దానిలో భాగంగానే బొగ్గు గనులను కూడా ప్రైవేట్ పరం చేస్తోంది. భవిష్యత్తులో ఎవరూ సింగరేణి బొగ్గును కొనే పరిస్థితి ఉండదు. తక్కువ ధరకు బొగ్గు విక్రయిస్తే వారి వైపే మొగ్గు చూపుతారు. క్రమక్రమంగా సింగరేణి కనుమరుగయ్యే అవకాశం ఉంది. కార్మికుల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది.

అన్యాయం చేస్తున్నారు : రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం బయటివాళ్లకు పని కల్పిస్తోంది. ఫలితంగా అసలైన సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతోంది. ఇప్పటికే ఓపెన్ కాస్ట్ లలో ప్రైవేట్ కాంట్రాక్టర్లతో పని చేయిస్తున్నారు. అందులో పనిచేసే కార్మికులు కూడా ఔట్ సోర్సింగ్ వారే. గతం కంటే కార్మికులు తగ్గిపోయారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు సింగరేణికి, కార్మికులకు అన్యాయం చేస్తున్నారు.

సింగరేణి పరుల పరం అవుతోంది : కె.మలయ్య, సింగరేణి కోల్ మైన్స్ కాలరీస్ సంఘ అధ్యక్షుడు

సింగరేణి పరుల పరం అవుతోంది. చట్టబద్ధంగా జరగాల్సింది చట్ట విరుద్ధంగా జరుగుతోంది. బయటి వ్యక్తులతో పనిచేయించడం దారుణమైన విషయం. ఇప్పటికే అనేక విభాగాలు ప్రైవేట్ పరమయ్యాయి. అండర్ గ్రౌండ్ బావులలో కూడా వారే పని చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి సింగరేణి. వేలాది మంది ఉపాధి అవకాశాలు సన్నగిల్లనున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వాలే ప్రైవేట్ పరం చేస్తే కాపాడేవారెవరు.

భవిష్యత్తులో సింగరేణి కనుమరుగు:ఎం.నర్సింహారావు, సింగరేణి ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి

పార్లమెంటులో ప్రైటీకరణకు సంబంధించి బిల్లు పెట్టినప్పుడు అనుకూలంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పడు వ్యతిరేకిస్తోంది. ప్రైవేటీకరణతో వందేళ్ల సింగరేణి భవిష్యత్ లో కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. సిరుల మాగాణంగా ఉన్న కంపెనీకి ఈ పరిస్థితి రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకుతిన్నట్లు ఉంది. రెండు ప్రభుత్వాల చర్యలతో లక్ష మంది కార్మికులు 40వేలకు చేరుకున్నారు.

Next Story

Most Viewed