వైద్యులపై దాడి చేస్తే కటకటాలే

by  |
వైద్యులపై దాడి చేస్తే కటకటాలే
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారితో వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. కుటుంబాలకు, పిల్లలకు దూరంగా ఉండి.. వ్యక్తిగత జీవితాన్నీ పక్కనపెట్టి కరోనా పేషెంట్‌లకు చికిత్సనందిస్తున్నారు. సమస్త మానవాళి కోసం ముందుండి చావును లెక్కచేయకుండా పోరుసల్పుతున్నారు. అన్నీ వదిలిపెట్టుకుని ఇతరుల ప్రాణాల కోసం పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, వైద్యారోగ్య సిబ్బంది.. ఇంకెవరి నుంచో నిత్యం అప్రమత్తంగా ఉండాల్సి వస్తున్నది. ఎప్పుడు.. ఏ క్షణానా.. ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారు. పుణ్యం చేయబోతే.. పాపం ఎదురైనట్టు.. కరోనావైరస్ అనుమానితుడే దాడి చేస్తాడో కూడా తెలియదు. తమ ప్రాణాలు లక్ష్యపెట్టకుండా.. ఈ మహమ్మారితో పోరాడేందుకు సిద్ధమే కానీ, రక్షణ పరికరాలు కావాలనో.. దాడుల నుంచో రక్షణ కల్పించాలనో వైద్యులు డిమాండ్ చేయడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్న విషయం. అందుకే మెజార్టీ ప్రజలు వైద్యులకు అండగా నిలుస్తున్నారు. కరోనా ఆపత్కాలంలో వైద్యుల ప్రాణాలు అమూల్యమైనవని, వారిని కాపాడుకోవడంలోనే మన మనుగడ ఉన్నదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైద్యులకు దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు, దాడి చేసిన వారికి కఠిన శిక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రాణాలు కాపాడేవారి ప్రాణాలకే ముప్పు..

కరోనా మహమ్మారితో ఎదురుబడి పోరాడుతున్నవారిలో వైద్యులు, పోలీసులు కీలకంగా ఉన్నారు. అయితే, వీరివురూ కొన్ని చోట్ల స్థానికుల నుంచి బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. దాడులకు గురవుతురు. కరోనా చెకప్‌ కోసం వెళ్లే వైద్యులపై కొందరు దాడులు చేస్తున్నారు. తెలంగాణ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యుడూ ఈ దాడికి గురికాకతప్పలేదు. అదీగాక, కరోనా పేషెంట్‌లకు చికిత్స అందిస్తున్నారని, వారితో తమకు వైరస్ సోకే ప్రమాదమున్నదని కొందరు స్థానికులు వైద్యారోగ్య సిబ్బందితో సానుకూలంగా మసులుకోలేదు. కొందరు ఇంటి యజమానులు అద్దె గదులు ఖాళీ చేయాలనీ ఒత్తిడి చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఈ సిబ్బంది ప్రాణాలను తీసేందుకూ కొందరు వెనుకాడటం లేదు.

ఈ నేపథ్యంలోనే వైద్యులు తమకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దాడులకు నిరసనగా ‘బ్లాక్ డే’ పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నిర్ణయించింది. బుధవారం రాత్రి 9 గంటలకు క్యాండిల్ లైట్లు వెలిగించి మౌనంగా నిరసన చేయాలని సభ్యులకు ఐఎంఏ పిలుపునిచ్చింది. సంకేతపూర్వకంగా ఈ నిరసనను చేపట్టాలని భావించింది. కాగా, ఈ ప్రదర్శన నేపథ్యంలోనే వైద్య నిపుణులతో కేంద్ర మంత్రులు వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశమయ్యారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సేవలపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలు హర్షం వ్యక్తం చేస్తూ వారిరక్షణకు హామీనిచ్చారు. ప్రభుత్వం వైద్యుల వెంటే ఉంటుందని తెలిపారు. ఈ భేటీ తర్వాత వైద్యులు నిరసన ప్రణాళికను విరమించుకున్నారు. వైద్యుల రక్షణకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించిన తర్వాత గంటల వ్యవధిలోనే కేంద్ర క్యాబినెట్ అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నది.

నేరస్తులకు ఏడేళ్ల జైలు శిక్ష.. ఐదు లక్షల జరిమానా!

వైద్యులపై దాడి చేస్తున్నవారిని ఉపేక్షించేది లేదని కేంద్రం తెలిపింది. నాగరిక సమాజంలో వైద్యులపై దాడులను ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించలేమని పేర్కొంది. అందుకే ఈ దాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్రం నిర్ణయాలు తీసుకుంది. ఘటన విచారణను నెల రోజుల్లో ముగించి.. మూర్ఖంగా వ్యవహరించినవారికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామని ప్రకటించింది. రూ. ఐదు లక్షల జరిమానా విధించనున్నట్టు తెలిపింది. వైద్యులకు, నర్సులకు, వైద్యారోగ్య సిబ్బందికి రక్షణ కల్పించే ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్‌, 1897ను సెంట్రల్ క్యాబినెట్.. సవరించి మరింత కఠినం చేసిందని కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు. ఈ సవరణ కింద వైద్యులు మొదలు ఆశా వర్కర్ల వరకు ప్రొటెక్షన్ కల్పించనుంది. వైద్యులపై స్వల్ప నేరాలకు పాల్పడినవారికి జైలు శిక్షలతోపాటు రూ. 2 లక్షల జరిమానా విధిస్తుంది. సీరియస్ నేరాలైతే.. గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష.. గరిష్టంగా ఐదు లక్షల జరిమానా విధించనుంది. అంతేకాదు, వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి చెందిన క్లినిక్‌లు, కార్లను ధ్వంసం చేసినట్టైతే.. రెట్టింపు సొమ్మును నేరస్తుల నుంచి వసూలు చేయనుంది. హెల్త్ వర్కర్లకు రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీ ఇచ్చే యోచనలోనూ ఉన్నట్టు కేంద్రం సంకేతమిచ్చింది.

Tags: coronavirus, pandemic, attack, doctors, medical staff, stringent, central cabinet, law, amend, IMA

Next Story

Most Viewed