అక్కడ మోడీ ఇక్కడ కేసీఆర్ ఇద్దరూ ఇద్దరే.. రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం

by  |
అక్కడ మోడీ ఇక్కడ కేసీఆర్ ఇద్దరూ ఇద్దరే.. రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం
X

దిశ, అచ్చంపేట : కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రెండూ కూడబలుక్కొని రైతులను వంచన చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాలతో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద డీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు పండించిన పంటను కొనుగోలు చేయమని ప్రభుత్వం చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం వరిని కొనమని చెబితే రైతులకు ఇంక దిక్కు ఎవరిని ప్రశ్నించారు.

కేసీఆర్ హటావో తెలంగాణ బచావో…

కేసీఆర్ ప్రభుత్వం రైతులను, ప్రజలను వంచించి నిరంకుశ పాలన సాగిస్తోందని, రైతులు పండించిన వరి పంట వారికే ఉరితాడుగా మారే విధంగా టీఆర్ఎస్ పాలనలో సాగిస్తోందని విమర్శించారు. అందుకే ‘కేసీఆర్ హటావో తెలంగాణ బచావో’ అంటూ అందరం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.ముఖ్యమంత్రి ప్రకటించిన రుణ మాఫీ లేదు. పండిన పంటలకు మద్దతు ధర లేదు. గతంలో సన్నాలు వేయాలని చెప్పిన కేసీఆర్.. ఈసారి మొత్తానికే వరి వేయొద్దంటే రైతులు ఎక్కడ పోవాలని, కనీసం ప్రత్యామ్నాయ పంటలు ఏం వేయాలి, దానికి సంబంధించి విత్తనాల సరఫరా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

మోడీ, కేసీఆర్ దొందూ దొందే..

కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దొందూ దొందే అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోంది. నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయని, దీనికి కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరే కారణమన్నారు. అదేవిధంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులకు మరింత నష్టాన్ని చేకూర్చేలా కేంద్రం విధానాలు ఉన్నాయన్నారు. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలన తీరుకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story