ఆ భేటీ ఆలస్యం వెనుక కేసీఆర్ వ్యూహం!

by  |
ఆ భేటీ ఆలస్యం వెనుక కేసీఆర్ వ్యూహం!
X

దిశ, న్యూస్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై చర్చించేందుకు కేంద్రం తేదీ ఖరారు చేసింది. రెండు రాష్ట్రాల నుంచి అపెక్స్ అంశంపై ఎలాంటి సమాధానం లేకపోవడంతో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఈ నెల 25న అపెక్స్ భేటీకి సిద్ధమైంది. దీనిపై ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు సూచనాప్రాయంగా సమాచారం పంపినట్లు తెలుస్తోంది. మొదటి దఫా వాయిదా పడ్డ నేపథ్యంలో ఈసారి మీటింగ్​ కచ్చితంగా నిర్వహించాలని పట్టుమీదుంది. అయితే ఏపీ ప్రభుత్వం ‘రాయలసీమ’ నిర్మాణానికి టెండర్లు కూడా ఖరారు చేసింది. ఇంతకు ముందే దీనిపై తెలంగాణ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఎన్జీటీలో కూడా అఫడవిట్ వేసింది. రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న క్రమంలో కేంద్రం అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న జరిగే భేటీలో జల వివాదాలు, కొత్త ప్రాజెక్టులు, ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లపై చర్చించనున్నారు. తేదీ ఖరారుపై నేడో, రేపో రాష్ట్రాలకు లేఖ పంపిచనున్నట్లు సమాచారం.

బోర్డులతో సమావేశం

రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారుడు వెదిర శ్రీరాములు సోమవారం కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల చైర్మన్లు పరమేశం, చంద్రశేఖర్ అయ్యర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించినట్లు శ్రీరాములు వెల్లడించారు. జలసౌధలో నిర్వహించిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలు, వినియోగంపై వివరాలు తీసుకున్నారు. బోర్డు సమావేశాల మినట్స్, అజెండాలపై చర్చించారు. త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ నిర్వహిస్తామని, దానికి సంబంధించిన ఎజెండా అంశాలను తయారు చేయాలని శ్రీరాములు బోర్డు చైర్మన్లకు సూచించారు. రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లపై కూడా వివరాలడిగారు. ఈ నెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఉంటుందనే నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారమే ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో కృష్ణా బేసిన్‌లో తెలంగాణకు రావాల్సిన 45 టీంసీల వాటా, మళ్లింపు జలాలు, బచావత్ ట్రిబ్యునల్ సూచనలు, కేంద్రం నియమించిన బజాజ్ కమిటీ ఏం చేస్తుందనే అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం.

ఇప్పడైనా సమయం ఇస్తారా..?

రెండు రాష్ట్రాల సీఎంలు అపెక్స్ కౌన్సిల్ భేటీకి ఈసారైనా సమయం ఇస్తారా లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే తెలంగాణ సీఎంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. దక్షిణ తెలంగాణను ఏడారిగా మార్చే రాయలసీమ ఎత్తిపోతలకు సీఎంకేసీఆర్ అండగా ఉంటున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. రాయలసీమ టెండర్లు ఫైనల్ అయ్యేందుకే సీఎం కేసీఆర్ మొదటిసారి అపెక్స్ కౌన్సిల్ భేటీ సమావేశాన్ని వాయిదా వేయించారని విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చుతూ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు టెండర్లు ఫైనల్ అయ్యాయని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన మెగా ఇంజినీరింగ్ సంస్థకే జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టు పనులను అప్పగించారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సీఎం కేసీఆర్ బంధువు, మాజీ ఎంపీకి చెందిన కాంట్రాక్ట్ సంస్థతో మెగాకు జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టు పనులను అప్పగించుకున్నారని, ఇరు రాష్ట్రాల సీఎంలు రహస్య ఒప్పందాల ప్రకారమే జల వివాదాల నాటకమాడుతున్నారంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి. టెండర్లు ఖరారు అయిన తర్వాత అపెక్స్ కౌన్సిల్​లో చర్చించినా ఫలితమేమీ ఉండదని, రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం ఆగదంటున్నారు పరిశీలకులు.

Next Story

Most Viewed