కరోనా వ్యాక్సిన్ తయారీలో సీసీఎంబీ ముందడుగు

by  |
కరోనా వ్యాక్సిన్ తయారీలో సీసీఎంబీ ముందడుగు
X

దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చి) సంస్థలు దాదాపు ఒకటిన్నర నెల రోజులుగా కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం వైరస్ సెల్ కల్చర్‌పై చేస్తున్న సంయుక్త ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కోవిడ్-19కు కారణమైన వైరస్ సార్స్ కోవ్-2 కల్చర్‌ను రోగుల శాంపిల్స్ నుంచి తీసుకుని వైరస్‌ను వేరు చేయడంలో సీసీఎంబీ వైరాలజిస్ట్ డాక్టర్ కృష్ణన్ హర్షన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం విజయం సాధించింది. ఆ వైరస్‌ను లాబ్‌లో కల్చర్ చేయగలిగినందున వాక్సిన్ అభివృద్ధి చేయడానికి, ఔషధాలను తయారు చేయడానికి ముందుడుగు పడినట్టయిందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా ఓ ప్రకటనలో తెలిపారు.

కరోనా వైరస్ పెరగటానికి వేరే కణాలను వాడుకుంటూ సీసీఎంబీ ఇప్పుడు వివిధ ప్రాంతాల వైరల్ నమూనాలను ఐసొలేట్ చేయగలుగుతోందని తెలిపారు. వైరస్‌ను నిర్వీర్యం చేయడానికి వాక్సిన్ అభివృద్ధిలో వాడగల వైరస్‌లను పెద్ద మొత్తాల్లో ఉత్పత్తి చేయటానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రయోగాలు వైద్య చికిత్సలో పనికొచ్చే యాంటీ బాడీలను తయారు చేయడానికి సాధ్యమవుతుందని తెలిపారు. వైరల్ కల్చర్ వాడుకుంటూ డీఆర్‌డీఓ లాంటి ఇతర భాగస్వాములతో కలిసి ఔషధాలకు సంబంధించి పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నమూనాలు అనేక పరిశోధనా సంస్థలతోబాటు ప్రయివేటు కంపెనీలలో కూడా వాడటం ద్వారా కరోనా మహమ్మారి మీద పోరాటానికి ఉపయోగకరమైన వనరులు తయారవుతాయని తెలిపారు.

వైరస్ కల్చర్ గురించి రాకేశ్ మిశ్రా వివరిస్తూ, ఇన్ఫెక్షన్లను తొలగించటానికి ఉపరితలం మీద ప్రయోగించే క్రిమి సంహారక మందులు, వ్యక్తిగత రక్షణ పరికరాలపై ఉండే వైరస్‌ను నిర్మూలించడం ఇన్ఫెక్షన్‌ను శుద్ధిచేయడం తదితరాల కోసం వాడే మందుల సామర్థ్యాన్ని పరీక్షించటంలో ఇప్పుడు సీసీఎంబీలో చేసిన వైరస్ కల్చర్ ప్రక్రియ చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. వైరస్‌ను చంపగల సామర్థ్యం ఆ క్రిమి సంహారక మందులకు ఏ మేరకు ఉన్నదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. వైరస్‌ను చంపడానికి, ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి వాడుతున్న అతినీలలోహిత కిరణాల పాత్ర గురించి కూడా స్పష్టత వస్తుందన్నారు.

Next Story

Most Viewed