కరోనా కోరల్లో కరీంనగర్

by  |
కరోనా కోరల్లో కరీంనగర్
X

దిశ, కరీంనగర్:

కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతుండగా.. ఇన్ని రోజులుగా ఇండియాలో ఈ మహమ్మారి ప్రభావం అంతంత మాత్రమే. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారిలోనే ఈ వైరస్ లక్షణాలు ఎక్కువగా బయటపడ్డాయి. అందులోనూ ప్రధాన నగరాల్లోనే ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం.. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌కే పరిమితమైన కరోనా వైరస్.. ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లాను కూడా తాకింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన 13 మంది విదేశీయుల్లో 8 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా కరీంనగర్ ఉలిక్కిపడింది. అప్రమత్తమైన అధికారులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్తగా కలెక్టరేట్‌కు 3 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. హోటళ్లు, దుకాణాలు మూసివేశారు. కాగా, ప్రస్తుతం కరీంనగర్‌లో వాతావరణం కర్ఫ్యూను తలపిస్తోంది.

బుధవారంరాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు కలెక్టరేట్‌కు 3 కిలోమీటర్ల పరిధిలో బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధక మందును స్ప్రే చేయించారు. మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా కరోనా వ్యాధి సోకిన విదేశీయులు పర్యటించిన ప్రాంతాల్లో సంచరిస్తూ మెడికల్ సర్వేకు సహకరించాలని కోరుతున్నారు. కొంతమంది నిరాకరిస్తుండటంతో ఆయా కాలనీల్లోని నాయకులకు బాధ్యతలను అప్పగించి సర్వే చేయిస్తున్నారు. ఇండోనేషియా నుంచి మత ప్రచారకులు 4 మసీదులు, రెండు హోటళ్లలో బస చేసినట్టుగా, వారు ఇప్పటి వరకు 8 మందిని వ్యక్తిగతంగా కలిసినట్టు అధికారులు గుర్తించారు. మత ప్రచారంలో భాగంగా వారంతా నగరంలో ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరిని కలిశారు ? అనే వివరాలు సేకరించే పనిలో ఉన్నామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కాగా.. మరి కొన్ని గంటల్లో ఈ విషయంపై ఓ క్లారిటీ వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, గుంపులు గుంపులుగా తిరగొద్దని మంత్రి గంగుల కోరారు. కొత్త వ్యక్తులను కలిసే ప్రయత్నం చేయవద్దని, తప్పని పరిస్థితుల్లో కలవాల్సి వస్తే.. వారికి ఒకటిన్నర మీటరు దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని గంగుల సూచించారు. అయితే కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదున, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రంగంలోకి 100 వైద్య బృందాలు:

కరోనా పంజా విసిరిన నేపథ్యంలో 100 ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దింపి, 16 టీమ్‌లకు ఓ డాక్టర్‌ను నియమించారు. కరీంనగర్ నగరంలోని ప్రతి ఇంటికి వైద్య బృందం వెళ్తుందని, ప్రతి ఒక్కరికీ నిర్బంధ వైద్యపరీక్షలు చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. అనుమానం ఉన్నవారిని వెంటనే హైదరాబాద్ గాంధీకి తరలించి అక్కడే చికిత్స అందిస్తామన్నారు. నగరంలో 20 ఐసోలేషన్ కేంద్రాలతోపాటు 10 ఐసీయూ బెడ్లు, రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 బెడ్లు సిద్ధం చేసింది. ఇండోనేషియన్లు ఢిల్లీ నుంచి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో రామగుండం చేరుకున్న తరువాత షేరింగ్ ఆటోలో కరీంనగర్‌కు వచ్చినట్టుగా గుర్తించిన అధికారులు డ్రైవర్‌ను కూడా పరీక్షించగా అతనికి వ్యాధి సోకలేదని నిర్దారించినట్టు తెలుస్తోంది. అలాగే ఇండోనేషియన్లతో విధులు నిర్వర్తించిన ఓ కానిస్టేబుల్‌కు కూడా నెగిటివ్ వచ్చినట్టు సమాచారం.

శాతవాహన వర్సిటీలో క్వారంటైన్

కోవిడ్ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారిని శాతవాహన విశ్వవిద్యాలయానికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. 14 రోజులపాటు వారిని అబ్జర్వేషన్ ఉంచి ఆ తరువాతే ఇండ్లకు పంపించనున్నారు. కరీంనగర్‌లో పోలీసులు గస్తీ ముమ్మరంగా సాగుతోంది. మఫ్టీ పోలీసులు.. ఇండోనేషియన్లు మకాం వేసిన ప్రాంతాల్లో ఉంటూ మసీదులకు వెళ్లిన వారి గురించి ఆరా తీస్తున్నారు. వారి పూర్తి వివరాలను సేకరిస్తూ ఎప్పటికప్పుడు జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం చేరవేస్తున్నారు. నగరంలోని పలుచోట్ల మఫ్టీ పోలీసులచే పికెట్లు ఏర్పాటు చేయించారు. కరోనా ప్రభావం ప్రార్థనా మందిరాలపైనా పడింది. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ రాజన్న ఆలయంలో పదిహేను రోజులపాటు ఆర్జిత సేవలు నిలిపివేయగా ధర్మపురి, కాళేశ్వరం, కొండగట్టు అంజన్న ఆలయాల్లో నివారణ చర్యలు తీసుకుంటున్నారు.

పుకార్లు నమ్మకండి: బండి సంజయ్

కరీంనగర్‌లో కరోనాపై పుకార్లను ఎవరూ నమ్మవద్దని, తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయాందోళనలకు గురి చేయవద్దని ఎంపీ బండి సంజయ్ కోరారు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలని, ప్రజలు భయభ్రాంతులకు గురికాద్దని, నగరంలో వంద వరకు మెడికల్ టీమ్‌లు తిరుగుతున్నాయని వారికి సహకరించాలని బల్దియా కమిషనర్ క్రాంతి వల్లూరి కోరారు.

TaGS : Corona, Karimnagar, Indonesia, Medical team, Isolation Centres

Next Story

Most Viewed