దేశంలో ఒక్కరోజే అత్యధికంగా 7,964 కరోనా కేసులు

by  |
దేశంలో ఒక్కరోజే అత్యధికంగా 7,964 కరోనా కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో :
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ పంజా విసురుతోంది. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసేటప్పటికి గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,964 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం కలవరం పెట్టిస్తోంది. ఈ రోజు వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,73,763కి చేరింది. ఒక్కరోజే 265 మంది కరోనాతో మరణించగా, వ్యాధితో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4,706కి చేరింది. ఇప్పటివరకు నమోదైన కేసులతో పోలిస్తే దేశం ప్రపంచంలోనే 9వ స్థానంలో ఉండగా, మరణాల్లో 13వ స్థానంలో ఉంది. కరోనా కేసులు చైనాతో పోలిస్తే రెట్టింపవడమే కాక, ఇంకా పెరుగుతుండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నేటికి 82,369 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం 86,422 మంది వ్యాధితో పోరాడుతున్నారు.దేశంలో ఒక్కరోజులోనే 11,264 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి కావడం ఊరట కలిగిస్తోంది. కరోనాతో ఇప్పటివరకు మరణించిన వారిలో 70 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారే కావడం గమనార్హం. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. దేశంలోనే ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 2,940 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 65,168కి చేరింది. రాష్ట్రంలో గడిచిన 14 రోజులుగా 2వేలకు పైనే కొత్త కేసులు రికార్డవుతున్నాయి.ఇక్కడ ఒక్కరోజులోనే 99 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,197కి చేరింది. తమిళనాడులో ఒక్కరోజే 856 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 21,184కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఒక్కరోజే ఆరుగురు మరణించడంతో ఇక్కడ ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 160కి చేరింది. దేశరాజధాని ఢిల్లీలో ఒక్కరోజే 1,163 కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 18,549కి వెళ్లింది.కొత్తగా నమోదైన 18 కరోనా మరణాలతో కలిపి మొత్తం చనిపోయిన వారి సంఖ్య 416కు చేరింది. గుజరాత్‌లో ఒక్కరోజే 412 కొత్త కేసులు నమోదవ్వగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య16,356కి చేరింది. నేడు 27 మంది చనిపోవడంతో ఇప్పటివరకు వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య 1,007కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 131 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 3,461కి చేరింది. ఈరోజు వరకు కరోనాతో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 792 యాక్టివ్ కేసులున్నాయి.

Next Story

Most Viewed