నర్సంపేటలో భూములు కొన్నవారు బాధపడుతున్నారు..!

by  |
నర్సంపేటలో భూములు కొన్నవారు బాధపడుతున్నారు..!
X

దిశ,నర్సంపేట: అసైన్డ్ భూముల్ని కొనుగోలు చేసిన వారి పరిస్థితి అగమ్యగో చరంగా తయారైంది. ఆ భూముల్లో క్రయవిక్రయాలు జరపొద్దని రెవెన్యూ శాఖ స్పష్టం చేయడంతో కొనుగోలు దారుల్లో ఆందోళన నెలకొంది. తమ డబ్బులు ఇవ్వాలని బాధితులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు.

నర్సంపేట నియోజకవర్గంలో కొన్ని నెలలుగా జరుగుతున్న అసైన్డ్ భూముల కొనుగోళ్లకు కలెక్టర్ చెక్ పెట్టారు. స్థానిక అధికారులు చొరవ తీసుకుని చేపట్టిన చర్యలు ఫలించక పోవడంతో ఏకంగా జిల్లా కలెక్టర్ హరిత రంగంలోకి దిగారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలకు ఆదేశించారు. అందులో భాగంగానే నర్సంపేట ఆర్డీవో పవన్ కుమార్ అక్రమాలకు వేదికైన అసైన్డ్ భూములను తనిఖీ చేశారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది సైతం ఆ భూములను క్రయవిక్రయాలు జరపొద్దని, నేరంగా పరిగణిస్తామని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

మొత్తం 3500 ఎకరాలు..

నర్సంపేట పట్టణ శివారులోని ఏజెన్సీ గ్రామమైన రాజుపేట గ్రామంలో దాదాపు 3,500 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. పీసా చట్ట పరిధిలోకి వచ్చే ఈ భూముల్లో వ్యవసాయేతర పనులు చేయడానికి వీలు లేదు. ముఖ్యంగా ఈ భూముల్లో క్రయవిక్రయాలు జరపకూడదు. జాతీయ రహదారి 365 వెంట అభివృద్ధి అవుతుందన్న సాకుతో భూ అక్రమార్కులు వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలని పథకం వేసుకున్నారు. దానికి అనుగుణంగా నర్సంపేట పట్టణం నుంచి ములుగు వెళ్లే రోడ్డు పక్కన, పాకాల వైపుగా ఉన్న భూముల్ని అధిక రేట్లకు అమ్మేందుకు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెర లేపారు.

కాగితాలపైనే అమ్మకాలు..

రాజుపేట పరిధిలోని అసైన్డ్ భూములన్నింటికీ పట్టాలు ఉండవు. పీసా చట్ట పరిధిలోకి వచ్చే ఈ భూముల్లో క్రయవిక్రయాలు జరపడానికి వీలు లేదు. అసైన్డ్ భూముల అక్రమ అమ్మకాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో స్థానిక రెవెన్యూ సిబ్బంది అక్కడ క్రయ విక్రయాలు జరపడం నేరమని తేల్చారు. ఇది తెలుసుకున్న కొనుగోలుదారులు షాక్‌కు గురయ్యారు. అమ్మకాలు జరిపిన రియల్టర్లను తమ డబ్బులు తిరిగిచ్చేయాలని గొడవకు దిగుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని అక్రమార్కులు వారికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు.

క్రయవిక్రయాలపై కలెక్టర్ ఆగ్రహం..

నర్సంపేట పట్టణ శివారులోని అస్సయిన్డ్ భూములు అమ్మకాలు జరిపిన సంగతి తెలుసుకున్న కలెక్టర్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా నర్సంపేట రెవెన్యూ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. హుటాహుటిన ఆర్డీవో పవన్ కుమార్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు.

హెచ్చరిక బోర్డులు

రాజుపేటలో ఉన్న అసైన్డ్ భూముల్లో క్రయవిక్రయాలు జరపకూడదంటూ స్థానిక రెవెన్యూ సిబ్బంది హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కమలాపురం గ్రామాన్ని ఆనుకుని ఉన్న అసైన్డ్ భూమి సర్వే నంబర్ 70లో ఉన్న నాలుగు ఎకరాల భూమి స్వాధీనం కోసం 39, 40 నోటీసును అక్రమార్కులకు జారీ చేశారు. అంతేకాకుండా వల్లభ్ నగర్‌లోని మినీ స్టేడియం వెనకాల అక్రమంగా కొందరు కమ్యునిస్ట్ నాయకులు దాదాపు రెండు ఎకరాల్లో అక్రమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. ఆ భూమిని సైతం స్వాధీనం చేసుకోవాలని సిబ్బందికి ఆర్డీఓ పవన్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా ఎవరు అతిక్రమణలకు పాల్పడినా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల కిందట రెవెన్యూ సిబ్బంది ఏజెన్సీ పరిధిలో భూ క్రయవిక్రయాలు జరపొద్దని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒక రోజు గడించిదో లేదో గుర్తు తెలియని వ్యక్తులు వాటిని తొలగించారు. ఈ ఘటనను రెవెన్యూ సిబ్బంది సీరియస్‌గా తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపడతామని అక్రమార్కులకు హెచ్చరికలు జారీ చేస్తూ మరోసారి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏ మేరకు రెవెన్యూ సిబ్బంది అక్రమార్కులకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తారోనని నియోజక వర్గంలోని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



Next Story

Most Viewed