సంస్థలో తొలగింపులు ఉండవు, అన్నీ కొత్త నియామకాలే: టీసీఎస్!

by Disha Web Desk 12 |
సంస్థలో తొలగింపులు ఉండవు, అన్నీ కొత్త నియామకాలే: టీసీఎస్!
X

న్యూఢిల్లీ: టెక్ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న వేళ దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కీలక ప్రకటన చేసింది. తాము ఎటువంటి తొలగింపులను చేపట్టబోమని, ఉద్యోగులను తీసుకున్న తర్వాత దీర్ఘకాలం పాటు వారి ప్రతిభను కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలిపింది. అంతేకాకుండా, ఇప్పటికే ఉద్యోగాలను కోల్పోయిన స్టార్టప్ ఉద్యోగులను కూడా నియమించుకునే ప్రయత్నాలు చేస్తున్నామని టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లకడ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇతర కంపెనీల తరహాలో ఉద్యోగులను తీసేయాలనే ఆలోచన లేదని, అవసరమైతే మరింతమంది టెక్ నిపుణులను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

చాలా కంపెనీలు తమకు అవసరమైన దానికంటే ఎక్కువ మందిని నియమించుకున్న కారణంగానే ఇప్పుడు తొలగింపుల ప్రక్రియను చేపడుతున్నాయి. టీసీఎస్ అవసరమైన మేరకే ఉద్యోగులను తీసుకుందని, ఒకసారి నియామకం జరిగిన తర్వాత ఉద్యోగుల ఉత్పాదకత, విలువను పెంచేందుకు కంపెనీ సహకరిస్తుందని ఆయన వివరించారు. కొన్ని సందర్భాల్లో అవసరమైన నైపుణ్యం తక్కువగా ఉంటే ఉద్యోగికి మరింత ఎక్కువ సమయం ఇస్తూ శిక్షణ పొందేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.


Next Story