ఆరేళ్లలో 5 కోట్ల ఉద్యోగాలివ్వనున్న కొత్త యూనికార్న్ కంపెనీలు

by Dishanational1 |
ఆరేళ్లలో 5 కోట్ల ఉద్యోగాలివ్వనున్న కొత్త యూనికార్న్ కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని కొత్త యూనికార్న్ కంపెనీలు భారత ఆర్థికవ్యవస్థకు 1 ట్రిలియన్ డాలర్ల సహకారం అందించనున్నాయని పరిశ్రమల సంఘం సీఐఐ తెలిపింది. 2030 నాటికి ఈ యూనికార్న్‌ల విలువ సుమారు రూ. 580 లక్షల కోట్లకు చేరుకుంటుందని, 5 కోట్ల ఉద్యోగాలను ఇవ్వనున్నాయని సీఐఐ గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన స్టార్టప్ కంపెనీలను యూనికార్న్‌లుగా పరిగణిస్తారు. ముఖ్యంగా రిటైల్, ఈ-కామర్స్, కొత్త తరం ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్‌వేర్ యాజ్-ఏ సర్వీస్(సాస్), డిజిటల్ వంటి రంగాల్లో భారీగా యూనికార్న్‌లు పుట్టుకురానున్నాయి. 2011లో భారత్ మొట్టమొదటి యూనికార్న్ కంపెనీని కలిగి ఉంది. దశాబ్దం తర్వాత భారత్ 100 యూనికార్న్‌ల మార్కును దాటింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో 113 యూనికార్న్‌లు ఉండగా, వీటి విలువ సుమారు రూ. 29 లక్షల కోట్లకు పైమాటే. నివేదిక ప్రకారం, 100కు పైగా యూనికార్న్‌లు, సుమారు లక్ష స్టార్టప్‌లు 2016 నుంచి 2023 మధ్య భారత జీడీపీ వృద్ధికి 10-15 శాతం దోహదపడ్డాయి. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు దేశ ఆర్థికవ్యవస్థకు సహకారం అందించనున్నాయని సీఐఐ ప్రెసిడెంట్ ఆర్ దినేష్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed