గోధుమ నిల్వలపై ప్రతివారం నివేదికను ఇవ్వాలని కోరిన ప్రభుత్వం

by Disha Web Desk 17 |
గోధుమ నిల్వలపై ప్రతివారం నివేదికను ఇవ్వాలని కోరిన ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద గోధుమ వినియోగదారు అయిన భారత్ దేశీయంగా గోధుమ నిల్వలను పెంచడానికి, అలాగే ధరలు అందుబాటులో ఉండేలా చూడడానికి కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వ్యాపారులు, ప్రధాన రిటైలర్లు, ఫుడ్ ప్రాసెసర్‌లు ప్రతి శుక్రవారం తమ వద్ద ఉన్నటువంటి గోధుమ నిల్వల డేటాను అందించాలని ప్రభుత్వం పేర్కొంది. గత రెండు సంవత్సరాలుగా గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా గోధుమ ఉత్పత్తి తగ్గింది.

ఈ నేపథ్యంలో స్థానికంగా గోధుమ సరఫరాను పెంచడానికి వ్యాపారులు తమ వద్ద ఎంత మేరకు గోధుమలు నిల్వ ఉంచవచ్చో ప్రభుత్వం పరిమితిని విధించింది. అయితే ఈ పరిమితి మార్చి 31తో ముగుస్తుంది, ఆ తర్వాత వ్యాపారులు తమ గోధుమ నిల్వలను తప్పనిసరిగా ప్రకటించాలని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చర్య వలన దేశంలో గోధుమల నిల్వలు ఎంత వరకు ఉన్నాయనే విషయంలో స్పష్టత వస్తుంది.

ఈ ఏడాది గోధుమల సేకరణ పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రైవేట్ కొనుగోళ్లను పర్యవేక్షించడంతో పాటు అవసరమైతే, సేకరణను సులభతరం చేయడానికి ప్రభుత్వం స్టాక్ పరిమితిని మళ్లీ విధించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వ గోదాముల్లో ఉన్న గోధుమ నిల్వలు 9.7 మిలియన్ మెట్రిక్ టన్నులకు తగ్గాయి. 2023లో, ప్రభుత్వం స్థానిక రైతుల నుండి 34.15 మిలియన్ టన్నుల గోధుమలు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 26.2 మిలియన్ టన్నులు కొనుగోలు చేసింది.


Next Story