వరుస ఎనిమిది సెషన్ల నష్టాలకు బ్రేక్!

by Disha Web Desk 17 |
వరుస ఎనిమిది సెషన్ల నష్టాలకు బ్రేక్!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. బుధవారం ట్రేడింగ్‌లో ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాల్లో షేర్ల కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరగడంతో వరుస ఎనిమిది సెషన్ల నష్టాల నుంచి సూచీలు లాభాల్లోకి మారాయి. ఉదయం నుంచే సానుకూలంగా మొదలైన ర్యాలీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు.

దీనికితోడు కీలక కంపెనీల షేర్లు పుంజుకోవడం మార్కెట్లకు కలిసొచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి జీఎస్టీ ఆదాయం భారీగా పెరగడం, వాహన పరిశ్రమలో మెరుగైన టోకు విక్రయాలు నమోదవడం, అంతకుముందు అంచనాలకు అనుగుణంగా త్రైమాసిక జీడీపీ డేటా వంటి అంశాలు స్టాక్ మార్కెట్ల లాభాలకు కారణమయ్యాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 448.96 పాయింట్లు ఎగసి 59,411 వద్ద, నిఫ్టీ 146.95 పాయింట్లు లాభపడి 17,450 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్ రంగం ఏకంగా 4 శాతం వరకు పుంజుకోగా, బ్యాంకింగ్, మీడియా, ఐటీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు మాత్రమే నష్టపోయాయి.

ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, టాటా స్టీల్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ బ్యాంక్, విప్రో కంపెనీల స్టాక్స్ అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.54 వద్ద ఉంది.



Next Story

Most Viewed