వారాంతం భారీ లాభాల్లో ముగిసిన సూచీలు!

by Disha Web Desk 17 |
వారాంతం భారీ లాభాల్లో ముగిసిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వారాంతం భారీ లాభాలు నమోదయ్యాయి. ముఖ్యంగా దేశీయంగా సానుకూల పరిణామాలకు గ్లోబల్ మార్కెట్ల మద్దతు లభించడంతో సూచీలు అధిక లాభాలను సాధించాయి. శుక్రవారం ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లలో ర్యాలీ మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో కొనుగోళ్ల జోరు ఊపందుకోవడంతో మదుపర్ల సెంటిమెంట్ పుంజుకుంది.

ఇదే సమయంలో గత నెలకు సంబంధించి భారత సేవల రంగం వృద్ధి 12 నెలల గరిష్ఠానికి చేరుకోవడం, మరోవైపు అదానీ కంపెనీల షేర్లు వరుసగా మూడో రోజు ర్యాలీ చేయడంతో మార్కెట్లకు కలిసొచ్చింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు గడిచిన నాలుగు వారాల్లో అధిక లాభాలను చూశాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 899.62 పాయింట్లు ఎగసి 59,808 వద్ద, నిఫ్టీ 272.45 పాయింట్లు లాభపడి 17,594 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకింగ్ అత్యధికగా 5 శాతానికి పైగా పుంజుకోగా, మెటల్ 4 శాతం వరకు రాణించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, అల్ట్రా సిమెంట్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్ కంపెనీల షేర్లు మాత్రమే నష్టాలను ఎదుర్కొన్నాయి.

ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, ఐటీసీ, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్స్ 2 శాతానికి పైగా లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 81.96 వద్ద ఉంది.

Next Story

Most Viewed