మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 17 |
మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతకుముందు సెషన్‌లో బలహీనంగా ర్యాలీ చేసిన సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో అదే ధోరణిని కొనసాగించాయి. ఉదయం కొద్దిసేపటి వరకు లాభనష్టాల మధ్య కదలాడిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల ప్రభావానికి తోడు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఎంపీసీ సమావేశం ఉన్న నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్త పడ్డారు. వరుస ఎనిమిది సెషన్ల నుంచి పతనాన్ని చూస్తున్న అదానీ కంపెనీ షేర్లు కోలుకుంటున్న సంకేతాలిచ్చినప్పటికీ ప్రధాన రంగాలైన ఐటీ, ఆటో షేర్లలో అమ్మకాలు సెన్సెక్స్, నిఫ్టీ లాభాలను తగ్గించాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 220.86 పాయింట్లు నష్టపోయి 60,286 వద్ద, నిఫ్టీ 43.10 పాయింట్లు కోల్పోయి 17,721 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ రంగం రాణించింది. ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్‌టీ, ఎస్‌బీఐ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.

టాటా స్టీల్, ఐటీసీ, సన్‌ఫార్మా, మారుతీ సుజుకి, హెచ్‌సీఎల్, టాటా మోటార్స్, హిందూస్తాన్ యూనిలీవర్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.74 వద్ద ఉంది.


Next Story

Most Viewed