వంట నూనె నిల్వల పరిమితి నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలన్న కేంద్రం!

by Web Desk |
వంట నూనె నిల్వల పరిమితి నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలన్న కేంద్రం!
X

దిశ, వెబ్‌డెస్క్: ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ప్రభుత్వ ప్రయత్నాలకు వంటనూనెల ధరలు ముప్పుగా మారాయి. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్రం వంటనూనెల నిల్వలపై విధించిన పరిమితుల్ని తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. దీనివల్ల సరఫరాలో ఎటువంటి సమస్యలు లేకుండా ధరలు నియంత్రణలో ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది వంట నూనెతో పాటు నూనె గింజల నిల్వలపై పరిమితుల్ని విధించిన సంగతి తెలిసిందే. ఇది ఈ ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉండగా, ఇటీవల దీన్ని జూన్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ పరిమితుల అమలుకు సంబంధించి సమీక్షించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రిటైలర్లు, రిటైల్ ఔట్‌లెట్లు, పెద్ద వినియోగదారులు 30 క్వింటాళ్ల వరకు, టోకు వినియోగదారులు 500 క్వింటాళ్ల వరకు నిల్వ ఉంచుకునే నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది. భారీ చెయిన్ రిటైలర్లు 1000 క్వింటాళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చు. వంట నూనెలను ప్రాసెస్ చేసిన వారు గరిష్ఠంగా 90 రోజులు మాత్రమే నిల్వ చేయాలని కేంద్రం వెల్లడించింది. కాగా, గత కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అధికంగా ఉండటంతో దేశీయంగా కేంద్రం నిల్వల పరిమితులతో పాటు సుంకం తగ్గింపు వంటి చర్యలు తీసుకుంది. దేశీయంగా అవసరమైన మొత్తం వంటనూనెలలో 60 శాతం దిగుమతుల పైనే మనం ఆధారపడి ఉన్నాం.



Next Story

Most Viewed