తిరిగి లాభాలు సాధించిన స్టాక్ మార్కెట్లు

by Dishanational1 |
తిరిగి లాభాలు సాధించిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చూసిన తర్వాత తిరిగి లాభాలను సాధించాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. భారత ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంలో మార్కెట్ల ర్యాలీ స్థిరంగా కొనసాగింది. ఇదే సమయంలో దేశీయ దిగ్గజ ఎఫ్ఎంసీజీ ఐటీసీలో బ్రిటిష్ అమెరికా టొబాకో కంపెనీ వాటాలను విక్రయించనున్నట్టు ప్రకటించడంతో ర్యాలీపై ప్రభావం కనిపించింది. అయితే, అంతకుముందు సెషన్‌లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరగడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 165.32 పాయింట్ల లాభంతో 73,667 వద్ద, నిఫ్టీ స్వల్పంగా 3.05 పాయింట్లు లాభపడి 22,335 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ మినహా అన్ని రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, మారుతీ సుజుకి, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టాటా మోటార్స్, నెస్లె ఇండియా, ఆల్ట్రా సిమెంట్, ఎన్‌టీపీసీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.78 వద్ద ఉంది.


Next Story