వారాంతం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by Dishanational1 |
వారాంతం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి అధిక నష్టాలను చూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీనమైన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్లు నిధులను ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలు సూచీలపై ఎక్కువ ఒత్తిడిని పెంచాయి. ముఖ్యంగా అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం డేటా వడ్డీ రేట్లను తగ్గించడంలో ప్రతికూలంగా ఉండటం, ఆసియా మార్కెట్లలో ర్యాలీ లేకపోవడం వారాంతం మన మార్కెట్లను ప్రభావితం చేశాయి. దీనికితోడు మిడ్, స్మాల్ క్యాప్‌లలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడం వంటి పరిణామాల కారణంగా నష్టాలు పెరిగాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 453.85 పాయింట్లు కోల్పోయి 72,643 వద్ద, నిఫ్టీ 123.30 పాయింట్లు నష్టపోయి 22,023 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, ఎల్అండ్‌టీ, సన్‌ఫార్మా స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.87 వద్ద ఉంది.


Next Story