వరుసగా మూడవరోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by Dishanational1 |
వరుసగా మూడవరోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు హ్యాట్రిక్ లాభాలను సాధించాయి. గురువారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఉదయం లాభాలతోనే ప్రారంభమైన సూచీలు రోజంతా ఒడిదుడుకుల మధ్యే కదలాడాయి. యూరప్ మార్కెట్లలో ద్రవ్యోల్బణం, మెరుగైన కార్పొరేట్ ఆదాయాల ప్రభావం గ్లోబల్ మార్కెట్ల ర్యాలీకి కారణమయ్యాయి. ఈ పరిణామాలు మన మార్కెట్లకు కలిసొచ్చాయి. అయితే, అధిక వాల్యూయేషన్ కారణంగా దేశీయ స్మాల్, మిడ్ క్యాప్‌లలో అమ్మకాలు కొంత ఒత్తిడిని కలిగించాయి.

మిడ్ సెషన్ తర్వాత కొనుగోళ్లు ఊపందుకోవడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా మూడవ రోజు లాభాలను సాధించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, మహీంద్రా కంపెనీల షేర్లలో ర్యాలీ ఎక్కువగా కనిపించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 227.55 పాయింట్లు ఎగసి 72,050 వద్ద, నిఫ్టీ 70.70 పాయింట్లు లాభపడి 21,910 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్ల ర్యాలీతో 3 శాతానికి పైగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా, సన్‌ఫార్మా, రిలయన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.05 వద్ద ఉంది. వరుస సెషన్లలో ర్యాలీ కారణంగా గురువారం మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. రూ.2.57 లక్షల కోట్లు పెరిగి రూ.387.3 లక్షల కోట్లకు చేరుకుంది.


Next Story