మార్చి వాహన రిటైల్ అమ్మకాల్లో 14 శాతం వృద్ధి!

by Disha Web Desk 7 |
మార్చి వాహన రిటైల్ అమ్మకాల్లో 14 శాతం వృద్ధి!
X

బెంగళూరు: ఈ ఏడాది మార్చి నెలలో దేశీయ వాహన పరిశ్రమలో వాహనాల రిటైల్ అమ్మకాలు 14 శాతం పెరిగి 20 లక్షల యూనిట్లకు చేరుకున్నాయని డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. పండుగ డిమాండ్‌తో పాటు కొత్త ఉద్గార నిబంధనల అమలు నేపథ్యంలో కొనుగోళ్లు పుంజుకున్నాయి. ఫాడా గణాంకాల ప్రకారం, టూ-వీలర్లు 12 శాతం, త్రీ-వీలర్లు 69 శాతం, ప్యాసింజర్ వాహనాలు 14 శాతం, వాణిజ్య వాహనాలు 10 శాతం పెరిగాయి. ట్రాక్టర్ అమ్మకాలు మాత్రమే 4 శాతంతో సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసింది. సమీక్షించిన నెలలో మొత్తం రిజిస్ట్రేషన్లు 2022లో 17,92,802 వాహనాలతో పోలిస్తే గత నెల 13.89 శాతం పెరిగి 20,41,847 యూనిట్లకు చేరుకున్నాయి.

గత నెల ట్రాక్టర్లు మినహా అన్ని విభాగాల్లో వాహనాల అమ్మకాలు రెండంకెల స్థాయిలో పెరిగాయి. ఈ ఏడాది ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగడం, ఎలక్ట్రానిక్ పరికరాల కొరత, కొత్త ఉద్గార నిబంధనల కారణంగా పెరిగే ధరలు పరిణామాల మధ్య అమ్మకాలు సింగిల్ డిజిట్‌కి పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా చెప్పారు. ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు నెమ్మదించవచ్చని ఫాడా అభిప్రాయపడింది. ఇప్పటికే మార్చిలో పడిన అకాల వర్షాలు, వడగళ్ల వాన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వాహన విక్రయాలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్నాయని మనీష్ రాజ్ పేర్కొన్నారు.

Next Story