RBI :రేపటి నుంచి ఇండియాలో digital currency!

by Disha Web Desk 17 |
RBI :రేపటి నుంచి ఇండియాలో digital currency!
X

ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు తీసుకురానున్న డిజిటల్ రూపాయి(ఈ-రూపీ)ని ప్రయోగాత్మకంగా రేపటి (నవంబర్ 1) నుంచి ప్రారంభించనున్నట్టు సోమవారం ప్రకటించింది. ముందుగా హోల్‌సేల్ అవసరాల కోసం వినియోగించడానికి దీన్ని ప్రారంభిస్తారు.

ప్రభుత్వ సెక్యూరిటీల్లో సెకండరీ మార్కెట్ లావాదేవీల కోసం డిజిటల్ రూపీని వినియోగించడం ద్వారా ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఈ పైలట్ ప్రాజెక్టులో ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్ఎస్‌బీసీ బ్యాంకులు పాల్గొంటాయని పేర్కొంది.

రిటైల్ విభాగంలో మరో నెల రోజుల తర్వాత ప్రారంభిస్తామని, ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో కొంతమంది వ్యాపారులు, వినియోగదారుల మధ్య లావాదేవీలను నిర్వహిస్తామని ఆర్‌బీఐ వివరించింది. డిజిటల్ రూపాయి ఇప్పుడున్న కరెన్సీ నోట్లకు జతగా అందుబాటులోకి వస్తోంది.

ఇప్పుడున్న చెల్లింపుల వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా కాకుండా, అదనపు చెల్లింపు అవకాశంగా ఇది ఉంటుందని గతంలో ఆర్‌బీఐ స్పష్టం చేసింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)గా పరిగణించే దీన్ని ఈ-రూపీ పేరుతో పిలవనున్నారు.



Next Story

Most Viewed