- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మరోసారి వడ్డీ రేట్లు యథాతథం
దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఊహించిన విధంగానే కీలక రెపో రేటును 6.5 శాతం వద్ద ఉంచుతున్నట్టు వెల్లడించింది. ఈ నెల 6న ప్రారంభమైన ద్రవ్య పరపతి విధాన సమీక్ష(ఎంపీసీ) నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దాస్, భారత వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదవుతోందన్నారు. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నాయి. ఆహార ధరల్లో అనిశ్చితి మాత్రమే ప్రధాన ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోంది. దీన్ని నియంత్రిస్తూ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం పరిధిలోనే కొనసాగేందుకు అవసరమైన చర్యలు, నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు.
కొత్త ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతంగా ద్రవ్యోల్బణం..
ఆహార ధరలు పెరుగుదల, ముడిచమురు ధరల అనిశ్చితి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ ద్రవ్యోల్బణాన్ని 5.4 శాతంగా అంచనా వేసింది. వచ్చే 2024-25లో 4.5 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. డిమాండ్ మెరుగ్గా ఉన్న నేపథ్యంలో దేశీయ వృద్ధి ఊపందుకునే అవకాశాలు ఉన్నప్పటికీ ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ అంచనాలను స్థిరంగా అంచనా వేసింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసే ప్రస్తుత త్రైమాసికంలో 5 శాతంగా అభిప్రాయపడింది.
పెరిగిన రుణంపై ఆర్‌బీఐ ఆందోళన..
కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థలతో సహా అనేక దేశాల్లో ఆర్థిక వృద్ధి ప్రభుత్వాల అప్పులు పెరగడం పట్ల ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కంటే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ప్రభుత్వ రుణ స్థాయిలు చాలా ఎక్కువ. గ్రీన్ ఎనర్జీ లాంటి ప్రాధాన్యత రంగాల్లో కొత్త పెట్టుబడుల ద్వారా రుణ భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని దాస్ అభిప్రాయపడ్డారు.
పేటీఎం సంక్షోభంపై దాస్..
ఎంపీసీ సమావేశాల నిర్ణయాలను వెల్లడిస్తున్న సమయంలో దాస్, ఇటీవల ఆర్థిక రంగాన్ని కుదిపేస్తున్న పేటీఎం వ్యవహారానికి సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. ఆర్థిక సంస్థలు కట్టుబడి ఉండాల్సిన కీలకమైన అంశాలను సూచించారు. 'ఆర్థికవ్యవస్థ, ఆర్థిక సంస్థల భద్రత, స్థిరత్వానికి మెరుగైన గవర్నెన్స్, బలమైన రిస్క్ మేనేజ్‌మెంట్, కస్టమర్ల ప్రయోజనాల రక్షణ చాలా ముఖ్యమని' దాస్ వివరించారు. ఆర్‌బీఐ ఈ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. నియంత్రణ పరిధిలో ఉన్న అన్ని సంస్థలు ఈ విధానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలు చర్చనీయాంసం అయ్యాయి.
గవర్నర్ దాస్ ప్రకటనల్లో ఇతర ముఖ్యమైన అంశాలు..
* ద్రవ్యోల్బణంపై ఆధార ధరల ఒత్తిడిని ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.
* 2024-25 ఆర్థిక సంవత్సరంలో నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 7.2 శాతం, 6.8 శాతం, 7 శాతం, 6.9 శాతంగా వృద్ధిని ఆర్‌బీఐ అంచనా వేసింది. 2024-25లోనూ వృద్ధి వేగవంతంగానే కొనసాగుతుంది.
* మూలధన వ్యయం ద్వారా ప్రభుత్వ మద్దతుతో దేశంలో పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి.
* 2024, ఫిబ్రవరి 2 నాటికి ఫారెక్స్ నిల్వలు 622.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
* గత ఆర్థిక సంవత్సరం భారత కరెన్సీ రూపాయి కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, మారకం విలువ స్థిరంగానే ఉందని దాస్ స్పష్టం చేశారు.
* అత్యధికంగా రెమిటెన్స్‌లను స్వీకరించే దేశంగా భారత్.
* అన్ని రిటైల్, ఎంఎస్ఎంఈల రుణాలకు 'కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్' తప్పనిసరి అని, దీని అమలు కోసం బ్యాంకులకు గడువు ఇవ్వనున్నట్టు దాస్ పేర్కొన్నారు.
* డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంచేందుకు, ఆయా లావాదేవీల ప్రామాణీకతకు ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను ఆర్‌బీఐ ఎంపీసీ కంపెనీ ప్రతిపాదించింది.
* ఆఫ్‌లైన్‌లో సైతం ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ పనిచేసేందుకు చర్యలు తీసుకుంటామని దాస్ వెల్లడించారు.