Credit Card EMI ఆప్షన్‌లో దాగి ఉన్న రహస్యం.. భారీ మూల్యం తప్పదు!

by Disha Web Desk 17 |
Credit Card EMI ఆప్షన్‌లో దాగి ఉన్న రహస్యం.. భారీ మూల్యం తప్పదు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం క్రెడిట్ కార్డులు ప్రతి ఒక్కరు వాడుతున్నారు. గతంలో కంటే దీని వినియోగం భారీగా పెరిగింది. ప్రజల చేతిలో డబ్బులు లేకపోతే క్రెడిట్ కార్డు ఉంటే చాలు దాని ద్వారా తమకు నచ్చింది కొనుగోలు చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి అనుగుణంగా బ్యాంకులు సైతం వినియోగదారులను ఆకర్షించడానికి క్రెడిట్ కార్డ్‌పై పలు ఆఫర్లను కూడా అందిస్తున్నాయి.

అయితే క్రెడిట్ కార్డు చెల్లింపులలో కొన్ని మార్పులు వచ్చాయి. వినియోగదారులు తమకు నచ్చిన విధంగా చెల్లింపులను ఎంచుకుంటున్నారు. ఒకేసారి బిల్లు మొత్తం చెల్లింపులు చేయలేనివారు సులభంగా ఉండేలా నెలవారి వాయిదాల పద్ధతి(EMI) సదుపాయం ఎంచుకుంటున్నారు. Credit Card EMI ఆప్షన్ ఈజీగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు, కానీ వీటిలో కూడా కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. వీటి గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం వలన వినియోగదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.


అదనపు వడ్డీ చెల్లింపు:

క్రెడిట్ కార్డు EMI సదుపాయంలో డాక్యుమెంటేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు కొంత వసూలు చేస్తారు. దీని గురించి కొన్ని కంపెనీలు ప్రారంభంలోనే చెప్తాయి. అన్ని కంపెనీలు కూడా క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ ఇవ్వవు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే దీనిని ఇస్తాయి. EMI లలో గడువు తేదీలోగా ప్రతినెలా బకాయిలను క్లియర్ చేయాలి. లేకుంటే వడ్డీ ఎక్కువగా పడుతుంది. ఒక్కనెల కూడా వాయిదా చెల్లించకపోయినా ఈ అమౌంట్‌ను వచ్చే నెల అమౌంట్‌తో కలిపి అదనంగా వడ్డీ విధిస్తారు. కాబట్టి EMI సదుపాయం ఉంది కదా, అని అనవసర ఖర్చులు చేయవద్దు. క్రెడిట్ కార్డ్‌ EMI చెల్లింపులు ప్రారంభంలో సులభంగా ఉన్నప్పటికి ఆలస్య చెల్లింపులకు పెనాల్టీలు 3 శాతం పైగా ఉంటాయి. దీంతో క్రెడిట్ స్కోర్ తగ్గి కొత్త రుణాలు పొందడం కష్టం అవుతుంది. కాబట్టి వినియోగదారులు Credit Card EMI తీసుకునే టైంలో అదనపు వడ్డీ గురించిన అంశాన్ని గుర్తుంచుకోవాలి.

క్రెడిట్ పరిమితి:

ఇది వినియోగదారుడు క్రెడిట్ కార్డు ఉపయోగించి ఖర్చు చేయగలిగే లేదా అప్పు తీసుకోగలిగే గరిష్ట మొత్తాన్ని పేర్కొంటుంది. ఇది ముఖ్యంగా రుణం తీసుకున్న వారి ఆదాయం, క్రెడిట్ స్కోర్, ట్రాన్సాక్షన్స్ హిస్టరీ, ఇతర వ్యక్తిగత వివరాలపై ఆధారపడి ఉంటుంది. జారీ చేసే బ్యాంక్ మీ కార్డ్‌పై క్రెడిట్ పరిమితిని నిర్ణయిస్తుంది.

Credit Card EMI ద్వారా చెల్లింపు చేసేటప్పుడు క్రెడిట్ కార్డు గరిష్ట మొత్తాన్ని ఉపయోగించడం కుదరదు. ఉదాహరణకు: క్రెడిట్ కార్డ్ గరిష్ట పరిమితి రూ. 60,000. దీనిలో రూ.30,000 EMI ఆప్షన్‌గా ఉంటే అంత మొత్తం అమౌంట్ వరకు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. మిగతా రూ. 30,000 వాడటం కుదరదు. సమయానికి చెల్లింపులు చేసినట్లయితే ఈ పరిమితి పెరుగుతుంది.

రాయితీలు:

కొన్ని సంస్థలు క్రెడిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులపై రాయితీలు అందిస్తాయి. వీటి గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి, ఎందుకుంటే చెల్లింపుల సమయంలో తగ్గింపు లభిస్తుంది. సందర్భాలను బట్టి ఈ రాయితీలు 5 నుంచి 10 శాతం వరకు ఉంటాయి. ఈ రాయితీలను క్యాష్‌బ్యాక్ రూపంలో కూడా పొందవచ్చు. పైగా వీటిని EMI గా కూడా మార్చుకోవచ్చు. కార్డ్‌ని స్వైప్ చేసినప్పుడు క్యాష్‌బ్యాక్, రివార్డ్‌ల పాయింట్లు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని రీడీమ్ చేసుకుని బకాయి పడిన రుణాలను చెల్లించవచ్చు. అలాగే, పెద్ద మొత్తంలో కొనుగోలు జరిపినప్పుడు కూడా ఈ ఆఫర్ల ద్వారా తగ్గింపు పొందవచ్చు.

క్రెడిట్ కార్డు మోసాలు:

పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా క్రెడిట్ కార్డ్ మోసాల సంఖ్య భారీగా పెరుగుతోంది. కార్డును క్లోన్ చేయడం, వివిధ పద్ధతుల్లో కార్డు వివరాలను దొంగలించడం ఇటీవల కాలంలో మరి ఎక్కువ అయింది. అందుకే ఎప్పటికప్పుడు స్టేట్‌మెంట్‌లను జాగ్రత్తగా చెక్ చేయాలి. అనుమానాస్పదంగా అనిపించే కొనుగోళ్ల గురించి బ్యాంక్‌కి తప్పకుండా తెలియజేయాలి. ఆన్‌లైన్ లావాదేవీలలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి.

ఎక్కువగా వాడటం:

క్రెడిట్ కార్డు EMI సదుపాయం ఉంది కదా అని కొనుగోళ్లు ఎక్కువగా జరపకూడదు. ఎందుకంటే వాయిదా పద్ధతిల్లో చెల్లింపు సౌలభ్యం ప్రారంభంలో సులభంగా ఉన్నప్పటికి రాను రాను భారంగా మారుతుంది. పైగా ఒక్క నెల వాయిదా చెల్లించకపోతే వడ్డీ భారం భరించలేనంతగా ఉంటుంది. అవసరం ఉన్న సమయాల్లో బ్యాలెన్స్‌కు అనుగుణంగా చెల్లింపులు జరపాలి.


ఇవి కూడా చదవండి:

మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా..? అయితే ఈ విధంగా ఈజీగా లోన్ పొందండి..!


Next Story