ఫాస్టాగ్ కోసం ఇతర బ్యాంకులు ఎంచుకోవాలన్న ఎన్‌హెచ్ఏఐ

by Dishanational1 |
ఫాస్టాగ్ కోసం ఇతర బ్యాంకులు ఎంచుకోవాలన్న ఎన్‌హెచ్ఏఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) విధించిన ఆంక్షలు మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనివల్ల కొన్ని రకాల సేవలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే ఆర్‌బీఐ గవర్నర్ గడువును పొడిగించే ఉద్దేశమేదీ లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) కీలక ప్రకటన జారీ చేసింది. ఫాస్టాగ్ కోసం పేటీఎంను వినియోగిస్తున్న కస్టమర్లు మార్చి 15లోగా మరొక బ్యాంకు నుంచి చెల్లింపులు చేసే విధానాన్ని ఎంచుకోవాలని సూచించింది. ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా, టోల్ ప్లాజాల వద్ద అసౌకర్యాన్ని నివారించేందుకు వీలైనంత వెంటనే ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాలని బుధవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. చేయని పక్షంలో జరిమానా లేదా రెట్టింపు ఫీజు కట్టాల్సి రావొచ్చని తెలిపింది. మరోవైపు, ఇదే అంశంపై బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్(బీఎస్ఈ) సైతం గడువులోగా ట్రేడింగ్ కోసం ఎవరైనా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాడుతుంటే మార్చుకోవాలని సూచించింది. ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకులోని బ్యాలెన్స్ ద్వారా రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉండదు. అయితే, నిర్ణీత తేదీ తర్వాత కూడా టోల్ చెల్లించేందుకు బ్యాలెన్స్‌ని ఉపయోగించవచ్చు.


Next Story