సెప్టెంబర్ నుంచి 'మేరా బిల్ మేరా అధికార్' పథకం ప్రారంభం!

by Dishaweb |
సెప్టెంబర్ నుంచి మేరా బిల్ మేరా అధికార్ పథకం ప్రారంభం!
X

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. జీఎస్టీ విధానాన్ని, వసూళ్లను మరింత మెరుగు పరిచేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 'మేరా బిల్ మేరా అధికార్ ' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటనలో వెల్లడించింది. ఏదేని కొనుగోళ్ల సమయంలో సంబంధిత ఇన్-వాయిస్ పొందేలా వినియోగదారులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు తెలిపారు. తొలుత హర్యానా, అస్సాం, గుజరాత్, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా, నగర్ హవేలీ, డమన్ డయ్యు, పుదుచ్చేరిలలో ప్రారంభించనున్నారు.

ప్రజలు ఈ పథకాన్ని మరింత ఆదరించటానికి చెల్లించిన బిల్లును ప్రభుత్వానికి చూపడం ద్వారా లక్కీ డ్రాలో రూ.1 కోటి గెలుచుకోవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హోల్‌సేల్, రీటైల్ వ్యాపారుల నుంచి తీసుకున్న ఇన్‌వాయిస్‌లను 'మేరా బిల్ మేరా అధికార్' యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. అనంతరం ఇన్‌వాయిస్ ఇన్సెంటివైజేషన్ స్కీమ్ ద్వారా రూ. 10 వేలు, రూ.10 లక్షలు, రూ.1 కోటి వరకు నగదు బహుమతి పొందవచ్చు. నెల, మూడు నెలలకోసారి లక్కీ డ్రా జరుగుతుందని అధికారులు వెల్లడించారు. కనీస కొనుగోలు విలువ రూ.200 పైన ఉన్న ఇన్-వాయిస్‌లను లక్కీ డ్రాకు అర్హతగా పరిగణిస్తామని అధికారులు చెప్పారు.


Next Story