కంపెనీల ఐపీఓ షేర్ ధరలను నిర్ణయించడంలో సెబీకి సంబంధం లేదు: ఛైర్‌పర్శన్!

by Disha Web Desk 7 |
కంపెనీల ఐపీఓ షేర్ ధరలను నిర్ణయించడంలో సెబీకి సంబంధం లేదు: ఛైర్‌పర్శన్!
X

ముంబై: కొత్త టెక్ కంపెనీల ఐపీఓ ధరలను నిర్ణయించడంలో మార్కెట్ నియంత్రణ సంస్థకు సంబంధం ఉండదని సెబీ ఛైర్‌పర్సన్ మాధబీ పురి బుచ్ తెలిపారు. మంగళవారం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఫిక్కీ) నిర్వహించిన కేపిటల్ మార్కెట్ వార్షిక సదస్సులో మాట్లాడిన ఆమె, కంపెనీల పబ్లిక్ ఇష్యూ ధరలను నిర్ణయించడం సెబీ పని కాదన్నారు. కానీ, ప్రీ-మార్కెట్ షేర్ ధర కంటే ఐపీఓ ధర ఎక్కువ ఉండటం గురించి కారణాలను మాత్రం టెక్ కంపెనీలు వివరించాలని ఆమె పేర్కొన్నారు. ఇటీవల కొన్ని టెక్ కంపెనీల ఐపీఓల్లో ఇష్యూ ధరను అత్యధికంగా నిర్ణయించినట్టు మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో దీనికి వివరణ ఇచ్చిన ఆమె, ఉదాహరణకు ప్రీ-మార్కెట్ ప్లేస్‌మెంట్‌లో ఒక షేర్‌కు రూ. 100 కేటాయించి, ఆ తర్వాత తక్కువ సమయంలో ఐపీఓ షేర్ ధరను రూ. 450గా కంపెనీలు నిర్ణయిస్తున్నాయి. ఐపీఓ షేర్ ధరను నిర్ణయించడంలో స్వేచ్ఛ ఉన్నప్పటికీ, నెలల వ్యవధిలోనే దాని విలువలో వ్యత్యాసం ఎక్కువ ఉండటంపై కంపెనీలు స్పష్టత ఇవ్వాలన్నారు. అలాంటి కంపెనీలు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన తర్వాత భారీగా పతనాన్ని చూస్తున్నాయి. ఇలాంటి పరిణామాల వల్ల చిన్న పెట్టుబడిదారులు నష్టపోతున్నారు. దీనికోసం సెబీ కొత్త టెక్ కంపెనీల ఐపీఓ ధరలపై మార్గదర్శకాలను జారీ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.



Next Story

Most Viewed