ఇంటి సామాన్ల రిపేర్ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పోర్టల్

by Disha Web Desk 17 |
ఇంటి సామాన్ల రిపేర్ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పోర్టల్
X

న్యూఢిల్లీ: దేశీయంగా గృహోపకరణాల రిపేర్, సర్వీసింగ్ కార్యకలాపాలకు సంబంధించి వినియోగదారుల హక్కులను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సర్వీస్ సెంటర్లతో పాటు రిపేర్ పాలసీలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట ఉంచేందుకు కావాల్సిన వివరాలను అందజేయాలని కన్స్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీలను ప్రభుత్వం కోరింది. తద్వారా రిపేర్, సర్వీసింగ్ వివరాలు ఒకేచోట లభించేలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగానే ఎల్‌జీ, శాంసంగ్, సోనీ, పానసోనిక్, ఫిలిప్స్, హావెల్స్, బ్లూస్టార్ సహా పలు కంపెనీలకు ప్రభుత్వం లేఖ పంపినట్టు ప్రభుత్వాధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా వినియోగదారులు తాము కొన్న రిఫ్రిజిరేటర్‌, గ్యాస్‌ స్టవ్‌తో పాటు వివిధ గృహావసరాలకు వాడే ఉత్పత్తుల రిపేర్, సర్వీసింగ్ డేటాను సులభంగా యాక్సెస్ చేయవచ్చని, ముఖ్యంగా తక్కువ ధరలో వాటిని రిపేర్ చేయించుకునేందుకు వీలుంటుందని అధికారులు తెలిపారు.

ఇంట్లో తరచుగా వాడుతున్న ఉత్పత్తుల రిపేర్, సర్వీసింగ్ వ్యవహారంలో కస్టమర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీన్ని పరిష్కరించేందుకు వీటి వివరాలకు సంబంధించిన ఒక పోర్టల్‌ను రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు వివరించారు.

మొదటి దశలో భాగంగా ప్రభుత్వం రిఫ్రిజిరేటర్, గ్యాస్ స్టవ్, ఆర్వోతో పాటు ఎంపిక చేసిన ప్రాథమిక గృహోపకరణాల వివరాలను పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత అన్ని ఉత్పత్తుల రిపేర్, సర్వీసింగ్‌కు అవసరమైన వివరాలను అందుబాటులోకి రానున్నాయి.

దీనివల్ల వినియోగదారులకు ఉత్పత్తులను రిపేర్ చేసే చోటు, ధరల వివరాలను కంపెనీలు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్పత్తులకు కంపెనీలు ఇచ్చే వారంటీ కార్డు పోగొట్టుకున్నప్పటికీ వినియోగదారులకు ఇబ్బందుల్లేకుండా కావాల్సిన సమాచారం పోర్టల్‌లో అందుబాటులో ఉండనున్నాయి.



Next Story

Most Viewed