బంగారం ఊరికే అలా పడి ఉందా? అయితే దాన్ని డిపాజిట్ చేసి వడ్డీ పొందండి!

by Disha Web Desk 17 |
బంగారం ఊరికే అలా పడి ఉందా? అయితే దాన్ని డిపాజిట్ చేసి వడ్డీ పొందండి!
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. పెళ్లిళ్లు, వివిధ ఫంక్షన్లకు వెళ్లాలంటే అది ధరించాల్సిందే. ఒకప్పుడు చాలా తక్కువ ధరలో దొరికిన బంగారం ఇప్పుడు సగటు మధ్యతరగతి వారు కొనే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా మంది ఎంతోకొంత బంగారం కొని పెట్టుకున్నారు. అయితే దాన్ని వాడకుండా ఇంట్లో ఉంచుకుంటారు. కానీ ఇలా పక్కన పెట్టిన బంగారం ద్వారా కూడా వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు.

అదేలాగంటే.. బంగారం డిపాజిట్ చేసి వడ్డీ పొందేందుకు ‘గోల్డ్ మానెటైజేషన్ స్కీమ్‌’ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 2015 లో తీసుకొచ్చిన ఈ స్కీమ్ ద్వారా ఆర్‌బీఐ ఎంపిక చేసిన బ్యాంకుల్లో కనీసం 10 గ్రాముల బంగారాన్ని డిపాజిట్ చేయొచ్చు. దీనికి గరిష్ట పరిమితి లేదు. దీని కోసం గోల్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయాలి.


ఈ స్కీమ్‌లో మూడు రకాల డిపాజిట్లు ఉన్నాయి. అవి 1-3 ఏళ్లకు షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్, 5-7 ఏళ్లకు మీడియం టర్మ్ బ్యాంక్ డిపాజిట్, 12-14 ఏళ్లకు లాంగ్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్. లాక్‌ఇన్ పీరియడ్ ఆధారంగా వడ్డీ రేటు ఉంటుంది. ఐదేళ్ల లాకిన్ పీరియడ్ అయితే 2.50 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది.

గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్, రాళ్లు లేని నగలు మాత్రమే డిపాజిట్ చేయాలి. బంగారం స్వచ్ఛత ఆధారంగా బ్యాంకులు బంగారం డిపాజిట్ చేయాలా వద్దా అని నిర్ణయిస్తాయి. లాకర్లలో బంగారం దాచుకుంటే లాకర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉండగా, ఈ స్కీమ్ ద్వారా డిపాజిట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు లేకపోగా, పైగా వడ్డీ కూడా లభిస్తుంది. ఇంట్లో ఖాళీగా ఉన్న బంగారాన్ని ఉపయోగించి ఇలా కూడా డబ్బులు సంపాదించవచ్చు. దీనిలో అదనంగా రుణ సదుపాయం కూడా ఉంది.



Next Story

Most Viewed