నాలుగు నెలల గరిష్ఠానికి తయారీ పీఎంఐ!

by Disha Web Desk 10 |
నాలుగు నెలల గరిష్ఠానికి తయారీ పీఎంఐ!
X

న్యూఢిల్లీ: కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి మెరుగ్గా నమోదైన కారణంగా భారత తయారీ పరిశ్రమ ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించిందని ఓ ప్రైవేట్ సర్వే తెలిపింది. గత నెల ఎస్అండ్‌పీ గ్లోబల్ ఇండియా మాన్యూఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) నాలుగు నెలల గరిష్టానికి 57.2 పాయింట్లకు పెరిగింది. అంతకుముందు మార్చిలో పీఎంఐ సూచీ 56.4 పాయింట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. కొత్త ఆర్డర్లు గణనీయంగా పెరిగాయని, దాంతోపాటు ధరల ఒత్తిళ్లు తగ్గడం, మెరుగైన అంతర్జాతీయ అమ్మకాలు, సరఫరా పరిస్థితులు సానుకూలంగా ఉండటం వంటి అంశాలు తయారీ పెరిగేందుకు దోహదపడ్డాయని ఎస్అండ్‌పీ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా అన్నారు. భారత తయారీదారులకు అపారమైన అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ఏడాది కొత్త ఆర్డర్లు పెరగడమే కాకుండా ఉద్యోగాల కల్పన ద్వారా సామర్థ్యం మరింత పెరగనుందని ఆమె తెలిపారు. కొత్త ఆర్డర్లతో పాటు ఉత్పత్తి రెండూ గతేడాది డిసెంబర్ తర్వాత అత్యంత వేగంగా వృద్ధి చెందాయి. ఈ పరిణామాలతో మార్చిలో 13 నెలల క్షీణత తర్వాత ఏప్రిల్‌లో నియామకాలు ఊపందుకున్నాయని ఎస్అండ్‌పీ గ్లోబల్ ఇండియా సర్వే వెల్లడించింది. కాగా, సాధారణంగా తయారీ పీఎంఐ సూచీ 50 పాయింట్ల కంటే ఎగువన ఉంటే వృద్ధిగానూ, దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు.


Next Story

Most Viewed