భారత్ తన వృద్ధిని నమ్మి పొరపాటు చేస్తుంది: రఘురామ్ రాజన్

by Disha Web Desk 17 |
భారత్ తన వృద్ధిని నమ్మి పొరపాటు చేస్తుంది: రఘురామ్ రాజన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ తన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అతిగా ప్రచారం చేస్తూ, దాని హైప్‌ను నమ్మి చాలా పొరపాటు చేస్తుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలమైన ఆర్థిక వ్యవస్థగా మారడానికి ముందు భారత్‌ గణనీయమైన నిర్మాణ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అతిపెద్ద సవాలు, శ్రామికశక్తి, నైపుణ్యాలను మెరుగుపరచడం అని రాజన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

1.4 బిలియన్ల జనాభాలో సగానికి పైగా 30 ఏళ్లలోపు ఉన్న దేశంలో యువత ఉపాధి కోసం ఎక్కువగా కష్టపడుతున్నారు. భారత్ చేసే పెద్ద తప్పు ఏమిటంటే హైప్‌ను నమ్మడం. చాలా సంవత్సరాలు కష్టపడితేనే భారత్ బలమైన అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆయన అన్నారు. అలాగే, 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాన్ని కొట్టిపారేశారు. దేశంలో యువ జనాభా పెరుగుతుంది. ముందుగా వారు ఉపాధి పొందడానికి కావాల్సిన సదుపాయాలు అందించాలి. ఆ తరువాత శ్రామికశక్తికి ఉద్యోగాలు కల్పించాలని ఆయన అన్నారు.

కరోనా కారణంగా భారతీయ పాఠశాల పిల్లల చదువు సామర్థ్యం 2012 కంటే ముందు స్థాయికి పడిపోయింది. మూడో తరగతి విద్యార్థులలో 20.5శాతం మంది మాత్రమే రెండో తరగతి పాఠాన్ని చదవగలరని ఆయన అన్నారు. భారతదేశంలో అక్షరాస్యత రేట్లు వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాల కంటే తక్కువగా ఉన్నాయి. దీనిని పెంచడానికి తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే, భారత్ స్థిరమైన ప్రాతిపదికన 8 శాతం వృద్ధిని సాధించడానికి చాలా ఎక్కువ కష్టపడాల్సి ఉందని రాజన్ అన్నారు.

బడ్జెట్‌లో ఉన్నత విద్య కోసం కంటే చిప్‌ల తయారీకి రాయితీలపై ఎక్కువ ఖర్చు చేయాలని మోడీ ప్రభుత్వం చేసిన విధానాలు తప్పు అని రాజన్ అన్నారు. భారత్‌ను సెమీ-కండక్టర్‌కు గమ్యస్థానంగా మార్చడానికి వ్యాపారాలకు 760 బిలియన్ రూపాయలు రాయితీలు ఇవ్వగా, అదే ఉన్నత విద్య కోసం మాత్రం 476 బిలియన్ రూపాయలను కేటాయించారు.

విద్యా వ్యవస్థను చక్కదిద్దే పని చేయకుండా చిప్‌ల తయారీ వంటి ఉన్నతమైన ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించింది, ఉన్నత విద్య ద్వారా ఆ పరిశ్రమలకు అవసరమైన మంచి ఇంజనీర్లను తయారు చేయవచ్చని ఆయన అన్నారు. విద్యను మెరుగుపరచడంతోపాటు, అసమానతను తగ్గించడం, శ్రమతో కూడిన ఉత్పత్తిని పెంచడం వంటి అనేక విధాన ప్రాధాన్యతల ద్వారా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా రాజన్ అన్నారు.


Next Story