30 శాతం వృద్ధిని నమోదు చేసిన ICICI బ్యాంక్

by Disha Web Desk 17 |
30 శాతం వృద్ధిని నమోదు చేసిన ICICI బ్యాంక్
X

బెంగళూరు: ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ 2022 -23 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసేనాటికి పన్ను తర్వాత లాభంలో 30 శాతం వృద్ధితో రూ. 9,122 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో రూ. 7018.71 కోట్లుగా ఉంది. ప్రధానంగా బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 40.2 శాతం పెరిగి రూ.17,667 కోట్లకు చేరుకుంది. మార్చి 2023 నాటికి డిపాజిట్లు రూ. 10.6 లక్షల కోట్ల నుండి 10.9 శాతం వృద్ధితో రూ. 11.8 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బ్యాంక్ ఆస్తి నాణ్యత స్థితి మెరుగుపడింది. స్థూల NPA నిష్పత్తి 2.81 శాతానికి తగ్గింది. నికర ఎన్‌పీఏ నిష్పత్తి 0.48 శాతానికి పడిపోయింది.

సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఐసీఐసీఐ రుణాలు ఆశాజనకంగా 20.5 శాతం పెరిగాయి. ప్రధానంగా వీటిని వ్యాపార బ్యాంకింగ్, రిటైల్‌‌లకు అందించారు. చిన్న వ్యాపారాలు, గ్రామీణ వ్యాపారాలకు రుణాలు సంవత్సరానికి 34.9 శాతం పెరిగాయి. కార్పొరేట్‌లకు ఇచ్చే రుణాలు 21 శాతం వృద్ధి చెందాయి. బ్యాంక్ రిటైల్ లోన్ పోర్ట్‌ఫోలియో ఏడాది ప్రాతిపదికన 22.7 శాతం పెరిగింది.

బ్యాంకు కరెంట్, సేవింగ్స్ ఖాతా నిష్పత్తి 43.6 శాతంగా ఉంది. తాజాగా, జరిగిన ఐసీఐసీఐ బ్యాంకు సమీక్ష సమావేశంలో తన షేర్ హోల్డర్లకు ఫైనల్ డివిడెండ్ గా రూ. 2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 8 లను ఇవ్వాలని బ్యాంకు నిర్ణయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 480 బ్రాంచ్‌లను ప్రారంభించినట్లు ఐసీఐసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.


Next Story