EV ఫాస్ట్ ఛార్జర్‌ల ఏర్పాటు కోసం షెల్ ఇండియాతో హ్యూండాయ్ ఒప్పందం!

by Disha Web Desk 17 |
EV ఫాస్ట్ ఛార్జర్‌ల ఏర్పాటు కోసం షెల్ ఇండియాతో హ్యూండాయ్ ఒప్పందం!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఇంధన సంస్థ షెల్‌ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 36 డీలర్‌షిప్‌లలో 60 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జర్‌లను ఏర్పాటు చేసేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది.

దేశంలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణను పెంచేందుకు ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుంది. కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాలను సాధించేందుకు వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం దీన్ని మరింత వేగవంతం చేస్తుందని హ్యూండాయ్ మోటార్స్ ఇండియా ఎండీ, సీఈఓ అన్సూ కిమ్ అన్నారు.

ప్రసుతం హ్యూండాయ్ దేశంలోని 45 నగరాల్లో 72 ఎలక్ట్రిక్ వాహనాల డీలర్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. సౌకర్యవంతమైన, ఇబ్బందుల్లేని ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అందించేందుకు హ్యూండాయ్‌తో ఒప్పందం చేసుకున్నామని షెల్ ఇండియా డైరెక్టర్ సంజయ్ వర్కీ తెలిపారు.


Next Story