సబ్బులు, టీ ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్న హిందూస్తాన్ యూనిలీవర్!

by Dishafeatures2 |
సబ్బులు, టీ ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్న హిందూస్తాన్ యూనిలీవర్!
X

ముంబై: ముడి సరుకుల ధరలు దిగిరావడంతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్ వినియోగదారులకు అందించే ఉత్పత్తులపై ధరల తగ్గింపు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు ఉత్పత్తుల ధరలు తగ్గించడంతో డీలర్లు, ప్రధాన డిస్ట్రిబ్యూటర్లు అందుకనుగుణంగా నిల్వలను మారుస్తున్నారు. పామాయిల్, టీ, ముడి చమురు వంటి కమొడిటీ ధరలు గరిష్ఠ స్థాయి నుంచి తగ్గాయి. అందుకే తగ్గిన ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నామని హెచ్‌యూఎల్ ప్రతినిధి స్పష్టం చేశారు. లాండ్రీ, స్కిన్ ఉత్పత్తులు, సబ్బులు, టీ వంటి విభాగాల్లో ధరలను తగ్గించామని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల తయారీలో ప్రధానమైన ముడి సరుకుల ఇటీవల తగ్గుతున్నాయి.

దానివల్ల కంపెనీలు కొంత ఉపశమనం లభించిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. గత రెండేళ్ల నుంచి పెరుగుతున్న ముడి సరుకుల ధరలు ఇప్పుడిప్పుడే దిగొస్తున్నాయి. ద్రవ్యోల్బణ పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో మార్జిన్‌ని కాపాడుకుంటూనే ధరల తగ్గింపు ద్వారా వినియోగదారులకు ప్రయోజనాలు అందిస్తున్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో హిందూస్తాన్ యూనిలీవర్ తన ఉత్పత్తులపై 18 శాతం వరకు ధరలను పెంచింది.




Next Story

Most Viewed