జనవరి-మార్చిలో 7 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు!

by Disha Web Desk 17 |
జనవరి-మార్చిలో 7 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: దేశీయ స్థిరాస్తి మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నాయని పరిశ్రమ డేటా, అనలిటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ మంగళవారం ప్రకటనలో తెలిపింది. దేశంలోని ప్రధాన 14 నగరాల్లో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు గతేడాది కంటే 7 శాతం పెరిగాయని ప్రాప్ ఈక్విటీ తాజా నివేదిక వెల్లడించింది. మౌలిక సదుపాయాల వృద్ధి, ప్రభుత్వ నిర్ణయాలు, స్థిరాస్తి రంగంలో కొత్త నిర్మాణాలు ప్రారంభం కావడమే దీనికి కారణం.

సమీక్షించిన కాలంలో హైదరాబాద్, పూణె, థానే నగరాలు అత్యధిక అమ్మకాల వాటాను సాధించాయి. హైదరాబాద్‌లో గతేడాది కంటే ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 17,236 యూనిట్లు విక్రయించబడ్డాయి. పూణెలో 25,536 యూనిట్లు, థానె 24,481 యూనిట్లను అమ్మకాలు నమోదయ్యాయి. మొత్తం ఇళ్ల అమ్మకాల్లో ఈ మూడు నగరాలదే ఏకంగా 54 శాతం ఉందని నివేదిక పేర్కొంది.

ఇక, ఇదే సమయంలో కొత్త నిర్మాణాలు పూర్తి చేయడంలో పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రాప్ ఈక్విటీ అభిప్రాయపడింది. మార్కెట్ పరిస్థితులు, సరఫరా అంతరాయాలు, నిర్మాణ కార్యకలాపాలలో జాప్యం వంటి వివిధ కారణాలు ప్రభావితం చేస్తున్నాయి. 2022, మొదటి త్రైమాసికంలో మొత్తం 1.13 లక్షల యూనిట్ల కొత్త నిర్మాణాలు అందుబాటులోకి రాగా, ఈ ఏడాది 18 శాతం క్షీణించి 93,600 యూనిట్లకు పడిపోయాయని నివేదిక పేర్కొంది.


Next Story